కాపులను బీసీల్లో చేర్చాలనే నినాదంతో ముద్రగడ పద్మనాభం అప్పట్లో చేసిన హడావుడి సంచలనమే సృష్టించింది. 2014 ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంగతి పూర్తిగా పక్కన పెట్టేసినట్టుగా వ్యవహరించడంతో, ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. కాపు ఉద్యమం ఏపీలో పెద్ద దుమారాన్ని రేపడంతో పాటు, తుని లో రైలు దహనం చేయడం తో పరిస్థితి అదుపు తప్పింది. అయినా టిడిపి నుంచి పెద్దగా స్పందన రాకపోగా,  ఆ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కఠినంగా వ్యవహరించడం, దీనిపై పెద్ద రాద్దాంతం జరగడం,  కాపు సామాజికవర్గం ఆగ్రహం టిడిపి చవిచూడడం అన్ని జరిగిపోయాయి. ఫలితంగా టిడిపి 2019 ఎన్నికల్లో కాపు ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలో ఘోర ఓటమి చవిచూసింది. ఇక ఎన్నికల ప్రచారంలో కాపులను బీసీల్లో చేరుస్తానని చెప్పి చంద్రబాబులా మోసం చేయలేను అంటూ జగన్ ఓపెన్ గానే చెప్పడంతో, అది సంచలనం సృష్టించింది. అయినా 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. 

 

ఇక కొద్ది రోజుల క్రితం కాపులను బీసీల్లో చేర్చే విధంగా వైసిపి గట్టిగా ప్రయత్నించాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ ముద్రగడ లేఖ రాశారు. కానీ ఆ విషయాన్ని పెద్దగా జగన్ పట్టించుకోలేదు. ఇక కాపు నేస్తం పేరుతో ఆ సామాజికవర్గాన్ని బాగానే ఆకట్టుకోవడంతో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం రంగంలోకి దిగి కాపులకు కావాల్సింది రిజర్వేషన్లు అంటూ, మళ్లీ ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. ఇక అక్కడి నుంచి ఈ వ్యవహారం మళ్లీ రాజుకుంది. వైసిపి, జనసేన ఈ విధంగా పట్టు సాధించడం, తాము రైతులు వెనుకబడి పోవడంతో, టిడిపి డైలమాలో పడిపోయింది. సోషల్ మీడియాలో కించపరిచే విధంగా టిడిపి కార్యకర్తలు కొందరు పోస్టింగులు పెట్టడం, వంటి పరిణామాలతో తాను కలత చెందానని, అందుకే కాపు ఉద్యమ పోరాటం నుంచి తప్పుకుంటానని, ఇప్పటికే సామాజికంగా , ఆర్థికంగా, మానసికంగా ఎంతో నష్టపోయానని ముద్రగడ భారీ బహిరంగ లేఖ రాస్తూ ప్రకటించడం సంచలనం రేపింది.


 ఇదంతా వైసీపీ ప్రభుత్వానికి మేలు చేసే విధంగానే ముద్రగడ ఈ నిర్ణయం తీసుకున్నాడనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కాపు ఉద్యమ సమయంలో వైసిపి ఆయన వెనుక ఉండి నడిపించింది అని, ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండటంతో, కాపు ఉద్యమం గురించి అందరూ ముద్రగడ ను ప్రశ్నిస్తూ జగన్ పై పోరాడాలని డిమాండ్ చేసే అవకాశం ఉండడంతో ఆయన జగన్ ను ఇబ్బందులు పెట్టడం ఇష్టం లేక ఈ ఉద్యమం నుంచి తప్పుకున్నారనే ప్రచారం మొదలుపెట్టారు. ఆయన ఈ మధ్యకాలంలో కాపు రిజర్వేషన్ అంశం పై జగన్ ను ప్రశ్నిస్తూ, లేఖలు రాసినా, అవి అంత ఘాటుగా లేవని, జగన్ కు ఏ ఇబ్బంది తలెత్తకుండా సున్నితంగా లేఖలు రాశారని ఆయనపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఉద్యమానికి ముగింపు పలుకుతూ ఆయన నిర్ణయం తీసుకోవడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: