విశాఖ అంటే అందమైన నగరం అని పేరు. సిటీ ఆఫ్ డెసిటినీ అంటారు. పర్యాటకులకు స్వర్గధామం విశాఖ. విశాఖను జీవితంలో ఒకసారి అయినా చూడాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. ఎత్తైన కొండలు, పచ్చని వాతావరణం, నీలిసంద్రం విశాఖకు పెట్టని ఆభరణాలు, ఎపుడూ పదహారణాల అందంతో విశాఖ ఎవర్ గ్రీన్ బ్యూటీగానే ఉంటోంది.

 

అటువంటి విశాఖ గత ఆరు నెలలుగా రాజకీయాలకు బలి అవుతోంది. విశాఖను రాజధాని చేస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిండు అసెంబ్లీలో విశాఖ మన పాలనారాజధాని అన్ని భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అది విశాఖకు శుభవార్త అయిందో లేదో కానీ నాటి నుంచి అచ్చమైన రాజకీయం మాత్రం  మొదలైంది. విశాఖను రాజధానిగా చేయవద్దు అంటూ ఒక ఉద్యమాన్ని టీడీపీ లేవదీసింది.

 

అమరావతే మన రాజధాని అని తమ్ముళ్ళు అంటూ వచ్చారు. ఆ తరువాత నుంచి విశాఖ రాజధాని ప్రయత్నాలకు ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూనే ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు విశాఖ బ్రాండ్ ఇమేజి కి  అతి పెద్ద దెబ్బ పడుతోంది. విశాఖలో వరసగా కర్మాగారాలో ప్రమాదాలు జరుగుతున్నాయి. దాంతో విశాఖ భద్రతాపరంగా  సేఫ్ కాదన్న మాట గట్టిగా వినిపిస్తోంది.

 

గతంలో విశాఖను రాజధాని చేయమంటే హుదూద్ తుఫాన్ సాకుగా చూపించిన వారు ఇపుడు వరస ప్రమాదాలను సాకుగా వాడుకుంటున్నారు, రాజకీయం చేస్తున్నారు అని వైసీపీ నేతలు ఓ వైపు అంటున్నారు. విశాఖకు శని పట్టింది అని గతంలో అన్న తెలుగు మహిళా ప్రెసిడెంట్ అనిత ఇపుడు విశాఖ మీద అష్టావక్రుని కన్ను పడి చెడిపోతోందని వైసీపీని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు.

 

ఇక విశాఖలో జరుగుతున్న వరస ప్రమాదాల వెనక కుట్ర కోణం ఉందన్న మాట వైసీపీ నేతల నుంచి వస్తోంది. ఎవరెలా అనుకున్నా ప్రమాదాలు మాత్రం జరుగుతున్నాయి. జనం ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇది వాస్తవం. ఈ రాజకీయాల మధ్య విశాఖ జనం నలిగిపోతున్నారని అంతా అంటున్నారు. మా విశాఖను మాకు వదిలేయండి ప్లీజ్ అంటున్న వారు ఇపుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. మొత్తానికి విశాఖ తలరాతను మార్చేసే రాజకీయం జరుగుతూండడంతో ఈ నగరానికి ఏమైంది అనుకోవాల్సివస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: