ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత మూడు రోజుల నుంచి రాష్ట్రంలో 1900కు పైగా నమోదవుతున్న కేసులు ప్రజలను గజగజా వణికిస్తున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో గత నాలుగు రోజులుగా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా ఏపీలో మాత్రం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. 
 
రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,916 కొత్త కేసులు నమోదు కాగా 43 మంది మృతి చెందారు. గత రెండు రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న మరణాలు ప్రజలను మరింత టెన్షన్ పెడుతున్నాయి. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసులు 33,019కు చేరగా 408 మంది మృతి చెందారు. రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 238 కేసులు నమోదు కాగా విశాఖ జిల్లాలో అత్యల్పంగా 28 కేసులు నమోదయ్యాయి. 
 
మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలో గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా ఏలూరులోని పడమర వీధిలో ఒకే ఇంట్లో 12 మంది కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మొదట కుటుంబ యజమానికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అనంతరం కుటుంబంలో అందరికీ పరీక్షలు నిర్వహించడంతో కరోనా సోకినట్లు తేలింది. 
 
కరోనా సోకిన వారిలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఉన్నారని తెలుస్తోంది. ఒకే ఇంట్లో 12 మందికి కరోనా నిర్ధారణ కావడంతో ఆ ఇంటికి చుట్టుప్రక్కల ఇళ్లల్లో ఉన్నవాళ్లు టెన్షన్ పడుతున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నా కేసుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటివరకు 11,95,766 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది.                           

మరింత సమాచారం తెలుసుకోండి: