ప్రేమంటే కలసి బతకడమే కాదు.. కలసి చావడం కూడా.. ఇలాంటి ప్రేమికుల సంభాషణలు ఎన్నో సినిమాల్లో చూశాం.. సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రేమ కథల్లో ఎన్నో మలుపులు పెడతారు రచయితలు.. చివరకు ప్రేమకథను సుఖాంతం చేస్తారు. కానీ అన్ని ప్రేమకథలు సుఖాంతాలే కావు. కొన్ని గండెల్ని పిండేసే విషాదాంతాలు ఉంటాయి. 

 

 

నిజ జీవితంలోనూ ప్రేమకథలు అంత సులభంగా సుఖాంతాలు కావు. కులం, ధనం, పెద్దరికం, సంఘం.. ఇలా ప్రేమికులను విడదీసే శక్తులు ఎన్నో.. ఇవేవీ లేనిచోట కొన్నిసార్లు దేవుడు కూడా విలన్ గా మారతాడేమో అనిపిస్తోంది. విశాఖ జిల్లాకు చెందిన శ్రావణ్, అంబికల ప్రేమ కథ కూడా అలాంటిదే. 

 

IHG

 

విశాఖ జిల్లాకు చెందిన శ్రావణ్‌, అంబిక ఏడాది కింద ప్రేమించుకున్నారు. ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండే వీరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి పెళ్లికి పెద్దలు మొదట్లో అడ్డు చెప్పినా దాన్ని విజయవంతంగా అధిగమించారు. ప్రేమ జంట కాపురం హాయిగా సాగిపోతోంది. ఆ ప్రేమఫలంగా, ప్రేమ ప్రతిరూపంగా అంబిక గర్భం దాల్చింది.

 

 

కానీ.. ప్రేమికులను విడదీసేందుకు ఈసారి విధి కుట్ర చేసింది. నెలలు నిండిన అంబికకు అనూహ్యంగా ఫిట్స్‌ వచ్చాయి. ఈనెల 6న విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారు. వైద్యులు సిజేరియన్‌ చేశారు. పండంటి మగబిడ్డను అంబిక ప్రసవించింది. అయితే.. ప్రేమకానుకను శ్రావణ్ చేతిలో పెట్టిన రెండు రోజులకు అంబిక తీవ్ర అస్వస్థతకు కన్నుమూసింది. 

 

 

అంబిక మరణంతో శ్రావణ్‌ కు ఈ లోకం చీకటిగా మారింది. ఆమెలేని జీవితంలో అతనికి అంతా శూన్యంగానే తోచింది. పగలు, రేయి.. అదే ఆవేదన. అది తట్టుకోలేని శ్రావణ్ ఆమె దగ్గరకే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం సాయంత్రం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయిదు రోజుల వ్యవధిలోనే ఆ ప్రేమజంట కన్నుమూసింది. వారి ప్రేమ ఫలమైన చిన్నారి మాత్రం అనాథగా మారాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: