తెలంగాణ ప్ర‌భుత్వంపై బీజేపీ చేస్తున్న అస‌త్య ప్ర‌చారాలు, ఆరోప‌ణ‌లు మానుకోవాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు హిత‌వు ప‌లికారు. క‌రోనాపై తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా ఉంద‌న‌డాన్ని ఆయ‌న ఖండించారు. ఆ ఆరోప‌ణ‌లు అస‌త్య‌మేగాక‌, నిరాధార‌మ‌ని కొట్టిపారేశారు. వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాలో రైతు వేదికలకు రాష్ట్ర గిరిజ‌న సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ తో క‌లిసి శంకుస్థాప‌న‌లు చేసిన సంద‌ర్భంగా ఆయ‌న జ‌న‌గామ జిల్లా కొడ‌కండ్ల‌లో ఈ విధంగా స్పందించారు. క‌రోనాపై అంద‌రికంటే ముందే అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం తెలంగాణ అన్నారు. 

 


సీఎం కేసీఆర్  అంద‌రికంటే ముందుగానే, లాక్ డౌన్ విధించార‌ని, ఆ త‌ర్వాత బీజేపీ పాలిత కేంద్ర ప్ర‌భుత్వం స్పందించిన సంగ‌తి మ‌ర‌చిపోవ‌ద్ద‌న్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌మంతా వ్యాపించింది. దేశంలోనూ ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క‌రోనా లేదా? అక్క‌డ మీరెందుకు అదుపు చేయ‌లేక‌పోతున్న‌రాని ప్ర‌శ్నించారు. క‌రోనా వైర‌స్ కి మందు లేద‌ని, టీకాలు రాలేద‌ని బిజెపి కి, ఆరోప‌ణ‌లు చేస్తున్న ఆ పార్టీ నేత‌ల‌కు తెలియ‌దా? అని ఆయ‌న ప్రశ్నించారు. ముందుగా మీరెందుకు క‌రోనాని అదుపు చేయ‌లేక‌పో తున్నారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు. అలాగే, గ‌త ఐదేళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఉపాధి హామీని వ్య‌వ‌సాయ రంగానికి అనుసంధానం చేయాల‌ని కోరుతున్నారు. మీరు ఏమాత్రం స్పందించ‌డం లేదు.

 


కూలీల‌కు మ‌రింత ఉపాధి క‌ల్పించ‌డంతోపాటు, రైతాంగాన్ని ఆదుకోవ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను మీరెందుకు నెర‌వేర్చ‌డం లేద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తెలంగాణ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్నబీజేపీ నేత‌ల‌ను ప్ర‌శ్నించారు. విమ‌ర్శ‌లు మానుకుని రైతుల‌కు మేలు చేసే ఆలోచ‌న‌లు చేయాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. బీజేపీ ఎంపీ అరవింద్‌పై వ‌రంగ‌ల్ లో టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు దాడి నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. దీంతో సోమ‌వారం వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ ఇంటి వ‌ద్ద‌కు వెళ్లి బీజేపీ నేత‌లు ఆందోళ‌న చేశారు. దీంతో ఓరుగ‌ల్లు రాజ‌కీయం ఇప్పుడు వేడెక్కింది. క‌మ‌లం వ‌ర్సెస్ గులాబీగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: