దేశంలో కేసుల సంఖ్యలో తొమ్మిది లక్షల మార్కును దాటేసింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 28,498 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 553 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు లో బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా కేసులు లక్ష దాటిన విషయం తెలిసిందే. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోందనీ.. అయినప్పటికీ ఏమాత్రం నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

 

కరోనా మళ్లీ ఎప్పుడు విరుచుకుపడుతుందో చెప్పలేం అని ఆయన ప్రజలను హెచ్చరించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతున్నాయి.. తగ్గాయన్న ఆనందంలో మళ్లీ రోడ్లపై విచ్చలవిడిగా తిరిగితే కరోనా తిరగబడే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. కొవిడ్-19 మళ్లీ ఎప్పుడు విజృంభిస్తుందో ఎవరికీ తెలియదు అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తున్న కారణంగానే ఈ మహమ్మారి అదుపులోకి వస్తోందని సీఎం పేర్కొన్నారు.

 

ఒక్కరు చేసే పొరపాటు వల్ల వందలు.. వేల మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని అన్నారు. కేవలం ప్రభుత్వం పోరాటంతోనే వైరస్ దారిలోకి రాదని గుర్తించాం. అందుకే అందర్నీ ఇందులో భాగస్వాములను చేశాం. అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే పరిస్థితి అదుపులోకి వచ్చింది అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. హోం ఐసోలేషన్ విధానం కూడా కరోనా అదుపులోకి వచ్చేందుకు మరో కారణమని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: