బాలీవుడ్, క్రికెట్​కు భారతీయుల్లో ఉన్న క్రేజ్​ను సొమ్ము చేసుకుందాం... వాళ్లకు కావాల్సిన సమాచారం అందిస్తూ సెర్చ్ మార్కెట్​లో ఎదుగుదాం "... ఒకప్పటి గూగుల్ వ్యాపార ప్రణాళిక ఇది. ఈ ప్లాన్​ అమలు చేసేందుకు హైదరాబాద్​నే వేదికగా ఎంచుకుంది. భారత్​లో మొట్టమొదటి బిజినెస్ సెంటర్​ను భాగ్యనగరంలోనే ఏర్పాటు చేసింది.

 

 

16 ఏళ్లు గడిచాయి. సెర్చ్ ఇంజిన్లలో రారాజుగా నిలిస్తే చాలనుకున్న గూగుల్... ఇప్పుడు సరికొత్త సాంకేతికతల అభివృద్ధిలో దూసుకెళ్తోంది. సామాన్యులు అంతర్జాలాన్ని వాడే విధానాన్నే సమూలంగా మార్చేసింది. ప్రతి ఒక్కరి జీవితంలో గూగుల్ భాగమైపోయింది. సాంకేతిక దిగ్గజంగా పేరొందిన ఈ గూగుల్​ను 1998లో లారీ పేజ్​, సర్గే బ్రిన్ అనే వ్యక్తులు కలిసి అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థాపించారు. ఆరేళ్ల తర్వాత భారత్​లో తొలి సంస్థను నెలకొల్పారు. భారత్​లో తన తొలి కార్యాలయం ప్రారంభించిన పదహారేళ్ల తర్వాత అత్యంత అధునాతనమైన సాంకేతికతలను ప్రస్తుతం దేశంలో అభివృద్ధి చేస్తున్నారు. వీటిని ప్రపంచమంతటికీ ఉపయోగపడేలా రూపొందిస్తున్నారు.

 

 

2018 సంవత్సరంలో డిజిటల్ చెల్లింపుల సాంకేతికత అభివృద్ధిలో భారత్​ ప్రపంచంలోనే అగ్రస్థానం సాధించింది. అంతకుముందే భారత్​లో గూగుల్ డిజిటల్ పేమెంట్ యాప్​ 'గూగుల్ టెజ్​'ను ప్రారంభించింది. అనంతరం పేరు మార్చి 'గూగుల్ పే'గా నామకరణం చేసింది. చెల్లింపులను డిజిటలైజ్ చేయడంలో భారత్​ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని, తద్వారా ప్రపంచస్థాయి ఉత్పత్తులు తయారు చేయడానికి సహాయపడుతోందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవలే పేర్కొన్నారు.

 

 

చిన్న వ్యాపారులు సైతం సాంకేతికతను వేగంగా స్వీకరించడం గూగుల్​ను ఆశ్చర్యపరిచింది. ఈ కారణంగానే త్వరితగతిన మార్పులన్నీ సంభవిస్తున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం దేశంలోని చిన్న వ్యాపారుల్లో మూడింట ఒక వంతు మాత్రమే సాంకేతికతను వినియోగించారు. ప్రస్తుతం 2.6 కోట్ల చిన్న వ్యాపారాలు ఆన్​లైన్​లో దర్శనమిస్తున్నాయి. గూగుల్ శోధన, గూగుల్ మ్యాప్స్​లలో వీటి సమాచారం అందుబాటులో ఉంటోంది. ఇది ప్రతి నెల 15 కోట్ల మంది వినియోగదారులను వ్యాపారులతో అనుసంధానం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: