కరోనా కట్టడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్వారంటైన్ నిబంధనల్లో మార్పులు చేసింది. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు.. ప్రాంతాలను హైరిస్క్‌ జోన్లుగా విభజించింది. అక్కడి నుంచి వచ్చేవారికి క్వారంటైన్‌ గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


 
ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారికి విధించే క్వారంటైన్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. తెలంగాణ, కర్ణాటకలను హైరిస్క్ ప్రాంతాలుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తక్కువ రిస్క్ ప్రాంతాలుగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఉండేవి. గతంలో ఈ రెండు రాష్ట్రాలను లోరిస్కు ప్రాంతంగా నిర్ధారించిన ప్రభుత్వం, ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తీవ్రస్థాయికి చేరటంతో ఈ రెండు రాష్ట్రాలను హైరిస్క్ ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది.

 

రహదారి మార్గంలో ఏపీకి వచ్చేవారికి బోర్డర్ చెక్‌పోస్టుల వద్ద స్వాబ్ టెస్టులు నిర్వహిస్తారు. ఏపీకి వచ్చేందుకు స్పందన యాప్ ద్వారా ఈ-పాస్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సరిహద్దుల దగ్గర చేసే పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలితే తక్షణమే కరోనా ఆస్పత్రికి తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, సచివాలయ ఉద్యోగుల ద్వారా.. హోమ్‌క్వారంటైన్‌లో ఉండే వ్యక్తుల కదలికలు గుర్తించాలని ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 

 

వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారికి 14 రోజులు హోమ్‌క్వారంటైన్ అమలులో ఉంటుంది. రైళ్లద్వారా ఏపీకి వచ్చేవారికి ర్యాండమ్‌గా టెస్టులు, 14 రోజుల క్వారంటైన్ నిబంధన అమలవుతుంది. విదేశాల నుంచి ఏపీకి వచ్చే వారు తప్పనిసరిగా 7 రోజులు క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధన ఉంది. గల్ఫ్ నుంచి వచ్చిన వారికి 14 నుంచి 7 రోజులకు క్వారంటైన్‌ను కుదించింది ప్రభుత్వం. విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్నవారికి 5, 7వ రోజు కరోనా టెస్టులు చేస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల్లో..10 శాతం మందికి ర్యాండమ్‌గా టెస్టులు చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టులు చేయాల్సిందిగా సూచనలు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: