గత కొన్ని నెలలుగా చైనా పేరు మారుమ్రోగుతోంది. ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా వైరస్ డ్రాగన్ నుంచే వ్యాప్తి చెందడంతో ఆ దేశంపై అగ్రరాజ్యం అమెరికా నుంచి చిన్న దేశాల వరకు తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డ్రాగన్ నిర్లక్ష్యం వల్లే తమ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయని.... వైరస్ ఈ స్థాయిలో వ్యాప్తి చెందడానికి చైనా కుట్రపూరితంగా వ్యవహరించడమే కారణమని పలు దేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. 
 
ఇదే సమయంలో చైనా మౌలిక వసతుల కల్పన పేరు చెప్పి పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్న లెక్కలు సైతం బయటకొస్తున్నాయి. సాధారణంగా ప్రపంచ బ్యాంకు అప్పులకు 3 నుంచి 4 శాతం వడ్డీ వసూలు చేస్తేనే మన దేశంలో పలు పార్టీలు అప్పులు తీసుకున్న పార్టీలపై విమర్శలు చేస్తూ ఉంటాయి. కానీ చైనా మాత్రం 6 శాతం వడ్డీ వసూలు చేస్తూ పలు దేశాలను నిలువుదోపిడీ చేస్తోంది. చైనా ఆ దేశాలలో పెట్టే పెట్టుబడులు అవతలి దేశాలు వడ్డీలు కూడా కట్టలేని స్థాయిలో ఉంటాయి. 
 
అలా వడ్డీలు కట్టలేని దేశాలలో పెట్టుబడులు పెట్టిన వాటిని తామే నిర్వహించుకుంటామని చెప్పి అక్కడ సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్, శ్రీలంక, బంగ్లాదేశ్ లలో ఇప్పటికే డ్రాగన్ ఇలాంటి అరాచకాలకు పాల్పడింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం చైనా గురించి చేసిన అధ్యయనంలో చైనా 152 దేశాలకు 112 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చినట్లు తేలింది. 
 
అనధికారికంగా ఈ అప్పుల మొత్తం ఇంకా ఎక్కువే ఉండవచ్చని తెలుస్తోంది. అప్పులు కట్టలేని దేశాల నుంచి చైనా ప్రతిఫలంగా శ్రీలంకలోని అంబక్ పేట ఓడరేవును 99 ఏళ్లకు లీజుకు తీసుకోవడం, లువాండాకు సమీపంలో కొత్త నగారాన్ని నిర్మించడం, పలు దేశాల్లో మొదలుపెట్టిన ప్రాజెక్టులను మధ్యలోనే ఆపేయడం చేస్తోంది. పలు దేశాలు ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీలు కూడా కట్టలేమని చైనాకు తేల్చి చెబుతున్నాయి. తాజాగా బయటకు వచ్చిన లెక్కలు చైనా ఏ విధంగా పేద దేశాలను ముంచేస్తుందో బయటపెడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: