నిజంగా షాకే. మాస్కు పెట్టుకోనందుకు కోటి రూపాయ‌ల ఫైన్ ఏంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? త‌ప్పదు మ‌రి. క‌రోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యమైనది మాస్క్ ధరించడం. మాస్క్ ధరించాలని అధికారులు నెత్తినోరూ బాదుకుంటూ చెప్తున్నారు. అయినా విన‌క‌పోవ‌డంతో కఠిన చర్యలతో పాటు భారీ ఫైన్ తప్పదని స్పష్టం చేశారు. దాన్ని అమ‌లు చేసి ఇలా ఫైన్ బాదేశారు. ఇది ఎక్క‌డంటే బెంగ‌ళూరులో మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న ప్రజలనుంచి గత నెలరోజుల వ్యవధిలో ఏకంగా కోటి జరిమానా వసూలు చేశారు బెంగళూరులో అధికారులు.

 

గ‌త కొద్దిరోజులుగా బెంగ‌ళూరులో పెద్ద ఎత్తున క‌రోనా కేసులు పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా విస్త‌ర‌ణ‌ను అరిక‌ట్టేలా అధి‌కారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు. దీంతో, బెంగళూరు నగర వ్యాప్తంగా మాస్కులు లేని వారిని ట్రాఫిక్ పోలీసులు, బీబీఎంసీ అధికారులు తనిఖీలు చేసి జూన్‌ నెలలో కోటి రూపాయల జరిమానా వసూలు చేసినట్టు అధికారులు ప్రకటించారు. మాస్కులు లేని వారు, భూతిక దూరం పాటించనివారు 50,706 మందిని గుర్తించి వారికి జరిమానా విధించారు .వీరి నుంచి రూ.1.91 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ వార్త పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతోంది. అయితే, ఇక‌నుంచైనా మాస్కులు పెట్టుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.

 

కాగా, ఈ రోజు సాయంత్రం నుంచి ఈనెల 22 వరకు రాజధాని బెంగళూరుతోపాటు దానిని ఆనుకుని ఉన్న జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసర సేవలు, కిరాణా దుకాణాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. కర్ణాటకలో సోమ‌వారం ఒక్క రోజే 2,738 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం బాధితుల సంఖ్య 41,581కి పెరిగింది. ఇప్పటి వరకు 757 మంది చనిపోయారు. ఇంకా 25 వేల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, దేశంలోని అనేక నగరాల్లో లాక్‌డౌన్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు‌ మళ్లీ అమలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: