తెలంగాణ‌లో క‌రోనా కేసులు పెద్ద ఎత్తున న‌మోదు అవుతున్న సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌లో కరోనా కేసులు రోజు రోజుకూ భారీ సంఖ్యలో నమోదవుతూ ప్రతిరోజు పలువురు నగరవాసులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న హైరిస్క్ జోన్లను అధికారులు గుర్తించారు. హైరిస్క్ జోన్ల నుంచి ఇతర ప్రాంతాలకు వైరస్ సోకకుండా అరికట్టవచ్చిన అధికారులు భావిస్తున్నారు. 500 కేసుల కంటే ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా పరిగణిస్తున్నారు. ఒక్కొక్క జోన్ లో 10 నుంచి 20 వరకు మొత్తంగా 100కు పైగా కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

 


హైద‌రాబాద్ న‌గ‌రంలో హైరిస్క్ జోన్లు నగరంలో ఇప్పటి వరకు 8 ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మెహదీపట్నం, యూసుఫ్ గూడ, అంబర్ పేట, చాంద్రాయణగుట్ట, చార్మినార్, కుత్బుల్లాపూర్, కార్వాన్, రాజేంద్రనగర్ సర్కిళ్లను హైరిస్క్ జోన్లుగా అధికారులు గుర్తించారు. ఈ జోన్లను హైరిస్క్ జోన్లుగా చేయాలని అధికారులు భావిస్తున్నారు. 

 


ఇదిలాఉండ‌గా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా మృతుల కోసం ప్రత్యేక శ్మశానాలను ఏర్పాటు చేయాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం స్థల సేకరణ కూడా పూర్తి చేసినట్టు తెలిసింది. కరోనాతో చనిపోయిన వారికి ప్రస్తుతం ఉన్నశ్మశానాల్లో అంత్యక్రియలు జరుపుతుంటే స్థానికుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. మరోచోట అంత్యక్రియలు జరపాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. దీంతో కరోనా మృతుల కోసం ప్రత్యేక శ్మశానాలను ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు అంటున్నాయి. ఇందుకోసం రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుని అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రెండు ప్రత్యేక శ్మశానాలు ఏర్పాటు చేయనున్నారు. బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో దాదాపు 4 ఎకరాల స్థలం గుర్తించారు. ప్రత్యేక శ్మశానాల్లో ఒకే ప్రాంతంలో అన్నిమతాల సంప్రదాయల ప్రకారం అంత్యక్రియలు జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. ఒక్కో మతానికి ఒక్కో చోట ఏర్పాటు చేయడం సాధ్యం కాదనే ఈ నిర్ణయానికి వచ్చింది. ఇక హయత్ నగర్ ఏరియాలో మరో శ్మశాన వాటిక కోసం 10 ఎకరాల భూమిని గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: