ఏపీలో కరోనా వైరస్‌ గుబులు పుట్టిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో ఏపీలో పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. అలాగే రికార్డ్‌ స్థాయిలో మరణాలు చోటు చేసుకున్నాయి. ఏపీలో అంతకంతకూ వ్యాపిస్తున్న కరోనా సామాన్యులు మొదలుకుని మంత్రులు వరకు ఎవరినీ వదలడం లేదు.

 

ఏపీలో కరోనా వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా జరుగుతోంది. సర్కార్‌ వైపు నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా.. పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేస్తున్నా.. వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. గతంలో కరోనా వైరస్‌ కొన్ని జిల్లాల్లో తీవ్రంగా.. ఇంకొన్ని జిల్లాల్లో ప్రభావం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం  లేదు. ప్రతి జిల్లా కరోనా వైరస్‌ పేరు చెబితే గడగడలాడుతుందనే చెప్పాలి.  మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం కరోనా వైరస్‌ బారిన పడిన వారు గడచిన 24 గంటల్లో 1916 కాగా.. ఇప్పటి వరకు ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 33 వేల 19కు చేరింది. ఇదే సమయంలో మరణాల సంఖ్య కూడా గడచిన 24 గంటల్లో రికార్డ్‌ స్థాయిలో నమోదైంది. గడచిన 24 గంటల్లో 43 మంది కరోనా బారిన పడి మృతి చెందినట్టు ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. అలాగే ఇప్పటి వరకు కరోనా బారిన పడి ఏపీలో మరణించిన వారి సంఖ్య 408కు చేరింది.

 

కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన తొలినాళ్లల్లోనే కాకుండా.. చాలా కాలంపాటు ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలు.. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో కరోనా వైరస్‌ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. కానీ ఇప్పుడు ఆ జిల్లాలో సీన్‌ రివర్స్‌ అవుతున్న పరిస్థితి. అనంతపురం కోరనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకు ఆందోళన కలిగిస్తోంది. మొదట్నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాతో కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో అనంతపురం పోటీ పడుతుందా..? అన్నట్టుగా కేసుల సంఖ్య అనంత జిల్లాలో పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 185 కేసులు అనంతలో నమోదై.. మొత్తంగా 3651 కరోనా పాజిటీవ్‌ కేసులతో అనంతపురం జిల్లా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 3823గా ఉంది. 

 

ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న కరోనా గణాంకాలను పరిశీలిస్తే.. విజయనగరం జిల్లా ఒక్కటే వేయి కేసుల లోపు ఉంది. ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 832గా ఉంది. ఇక మూడు వేల కేసుల దాటిన జిల్లాల జాబితాలో కర్నూలు, అనంతపురం, గుంటూరు, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. కర్నూలు, అనంత జిల్లాలు టాప్‌ రెండు స్థానాల్లో ఉండగా.. గుంటూరు జిల్లా 3356 కేసులు.. తూర్పు గోదావరి జిల్లా 3115 కేసులు, చిత్తూరు జిల్లా 3074 కేసులతో వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇక రెండు వేల మార్క్‌ దాటిన జిల్లాల విషయానికొస్తే.. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2744 కాగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో కేసుల సంఖ్య 2026కు చేరింది. ఇక మిగిలిన ఐదు జిల్లాల్లో కేసుల సంఖ్య వేయి దాటాయి. కడప, విశాఖ, నెల్లూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. 

 

అలాగే కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో వారూ.. వీరూ అని లేకుండా అందరూ ఉంటున్నారు. డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు సహా సుమారు పది మందికి పైగా ప్రజా ప్రతినిధులు ఉన్నారు. అలాగే సీఎం కార్యాలయంలో విధులు నిర్వహించే ఐఏఎస్సులూ ఉన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ విషయంలో ప్రభుత్వం అన్ని రకాలుగా అలర్ట్‌ అవుతున్నా.. అంతంతకూ పెరుగుతున్నకేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: