తన చేష్టలతో, నియంత్రణలేని మాటలతో.. ఎప్పుడూ వివాదాల్లో నిలిచే బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సెనారోను... మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. కరోనా సోకడంతో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న జైర్‌.. తనకు అలా ఉండడం అసలు ఇష్టం లేదని చెప్పారు. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

తాను ఐసోలేషన్‌లో ఉండలేకపోతున్నాననీ... మరోసారి కరోనా పరీక్ష చేసుకోవాల్సి ఉందని.. దానికోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని జైర్‌ చెప్పారు. ఇలా ఇంటికే పరిమితమై ఉండటం భయంకరంగా ఉందని.. తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యా లేదని జైర్‌ వ్యాఖ్యానించారు. పరీక్ష ఫలితం ఎలా వస్తుందో తెలియదని.. అయితే తాను మళ్లీ విధులను ప్రారంభించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అయితే, ఫలితం భిన్నంగా వస్తే మాత్రం.. చుట్టుపక్కల వారికోసమైన మరికొన్ని రోజులు ఎదురుచూస్తానని చెప్పారు.

 

అయితే ఒక దేశ అధ్యక్షుడై ఉండి.. హోం ఐసోలేషన్‌ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమవుతోంది. దీన్నిబట్టి చూస్తే బోల్సెనారోపై కొవిడ్‌ ప్రభావం తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు రుచి, వాసన పోలేదు. కానీ, బ్రెజిల్‌లో మాత్రం కొవిడ్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ప్రపంచంలోనే కొవిడ్‌కు అత్యధికంగా ప్రభావితమైన రెండో దేశంగా నిలిచింది. ఇక్కడ సోమవారం నాటికి 73వేల మంది కొవిడ్‌ కారణంగా మృతి చెందారు.  

 

కొన్ని నెలల క్రితం వరకు దేశంలో పెద్దగా వ్యాపించని వైరస్‌.. కట్టడి చర్యల్లో అధ్యక్షుడు బోల్సెనారో నిర్లక్ష్యం వల్లే మారుమూల అమెజాన్‌ అటవీ ప్రాంతాలకు కూడా పాకిపోయింది. ఆయన చాలా రోజులు మాస్కు కూడా లేకుండా తిరిగారు. ర్యాలీలు నిర్వహించారు. ఆయన అభిమానులు అదే తీరును అవలంభించారు. గతవారమే ఆయన ఫేస్‌ మాస్క్‌ తప్పనిసరి నిబంధనను రద్దు చేశారు. అదే రోజు ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

 

ఇక, తనకు కరోనా సోకిందన్న విషయాన్ని.. వెల్లడించిన తీరు కూడా వివాదాస్పమైంది.ఈ విషయాన్ని ప్రకటించడంలోనూ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించారు. విలేకర్లను దగ్గరగా పిలిచి.. తనకు వైరస్‌ సోకిందని చెబుతూ, అప్పుడు మాస్క్‌ ధరించారు. ఈ వైఖరితో మీడియా ప్రతినిధులు భయపడిపోయారు. ప్రస్తుతం మరోసారి.. అలాంటి తీరే అవలంభించారు. ప్రజలకు మంచి చెప్పాల్సిన వ్యక్తి... ఐసోలేషన్‌లో ఉండలేకపోతున్నానంటూ మాట్లాడం విమర్శలకు దారి తీస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: