ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలుగా విడగొట్టే యోచనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆలోచనకు అటు అధికార పార్టీ ఎమ్మెల్యేల నుండి ఇటు ప్రత్యర్థి పార్టీ నేతల నుండి కూడా వ్యతిరేక గళం వినిపిస్తున్న నేపథ్యంలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఇరు పార్టీల్లోని కొందరు నేతలు కొత్త జిల్లాల విభజనలో సుముఖత వ్యక్తం చెయ్యనప్పటికీ బాలయ్య మాత్రం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.

 

అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్రాలో ఉన్న చిన్న జిల్లాల్లో ఒకటి అయిన శ్రీకాకుళం జిల్లాని సైతం విభజించే యోజనలో జగన్ ప్రభుత్వం ఉండటంతో శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే చిన్న జిల్లా కావడంతో శ్రీకాకుళం లాంటి జిల్లాలని విడగొట్టడం వల్ల ఉపయోగం లేదని  ఆయన వాపోతున్నారు. శ్రీకాకుళంతో పాటు పలు జిల్లాల పునర్విభజన విషయంలో ఆలోచించాలని ముఖ్యమంత్రి జగన్‌ని కోరతామని చెబుతున్నారు.

 

అలాగే కొందరు టీడీపీ నేతలు సైతం ఉన్న 13 జిల్లాలని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విభజించడం సరైన పద్ధతి కాదని.. జగన్ నిర్ణయం సరైనది కాదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన జరిగేటట్టు అయితే హిందూపురం నియోజకవర్గాన్ని కూడా కొత్తగా జిల్లాగా చెయ్యాలని బాలయ్య తన లేఖలో కోరారు. అంతే కాకుండా వైద్య వృత్తి చదవడం కోసం నియోజకవర్గంలోని విద్యార్థులు ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్తున్న నేపథ్యంలో హిందూపురంలోనే మంచి వసతులతో వైద్య కళాశాల కట్టాలని బాలకృష్ణ తనలేఖ ద్వారా ముఖ్యమంత్రిని కోరారు.

 

సొంత పార్టీ నేతల్లోనే కొత్త జిల్లాల విభజనపై సుముఖత లేకపోవడం బాలయ్య మాత్రం కొత్తజిల్లాల విభజనకి మద్దతు పలకడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: