గత ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందన్న స్థానాల్లో కూడా జగన్ సునామీలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీకి అండగా ఉండే కమ్మ సామాజికవర్గం  నేతలు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అయితే ఎన్నికలు ముగిసి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో అధికారం కోల్పోయిన కొందరు కమ్మ నేతలు ఈ ఏడాది సమయంలో కాస్త పుంజుకున్నట్టే కనిపిస్తున్నారు. అలా పుంజుకున్న నేతల్లో పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేరు ప్రధానంగా చెప్పుకోవచ్చు. 2014లో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన బోడె ప్రసాద్ దాదాపు 31వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో అప్పటి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుక్కల విద్యా సాగర్‌పై విజయం సాధించారు.

 

పైగా టీడీపీ కూడా అధికారంలో ఉండటంతో బోడె ప్రసాద్‌కు నియోజకవర్గంలో మంచిగా పనులు చేసుకునే అవకాశం దక్కింది. ఎమ్మెల్యేగా ఉన్న 5ఏళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అలాగే మునుపెన్నడూ లేనివిధంగా పెనమలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించారు. పైగా రాజధాని అమరావతి దగ్గరగా ఉండటంతో పెనమలూరు ఊహించని విధంగా అభివృద్ధి జరిగింది. అయితే 2019 ఎన్నికల విషయానికి వచ్చేసరికి బోడె పని తీరు కంటే జగన్ గాలే ఎక్కువ డామినేట్ చెయ్యడంతో అనూహ్యంగా మాజీమంత్రి పార్థసారధి వైఎస్సార్ సీపీ తరపున 11వేల ఓట్ల పైనే మెజార్టీతో విజయం సాధించారు.

 

ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గర నుండి పార్థసారథి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో ముందుకు సాగిపోతున్నారు. కాకపోతే ఈ ఏడాది సమయంలో పెనమలూరు ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందడమే తప్ప కొత్తగా చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ జరగలేదు. దీనికి తోడు ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడం వలన బాగా అసంతృప్తిలో ఉన్నారు. వీటితో పాటు ఇసుక, ఇళ్ల పట్టాలల్లో అక్రమాలు జరిగాయని వార్తలు వినిపించడం కూడా కాస్త మైనస్ అవుతుంది.  ఇక అన్నిటికంటే మరీ ముఖ్యంగా పెనమలూరు రాజధాని అమరావతికి దగ్గరగా ఉండటంతో ఇక్కడి ప్రజలు మూడు రాజధానుల నిర్ణయాన్ని  జీర్ణించుకోలేకపోతున్నారు.

 

వైఎస్సార్ సీపీలో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ ప్రతిపక్ష నేత బోడె ప్రసాద్‌కు కలిసొస్తున్నాయి. పైగా బోడె ప్రసాద్ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు పోరాడుతున్నారు. అలాగే పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. దీనితో ఏడాది సమయంలోనే బోడె ప్రసాద్ తిరిగి పుంజుకుని ప్రజల్లో పట్టు తెచ్చుకున్నారు. కృష్ణా జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఇంకా వీక్ గానే కనిపిస్తున్నా పెనమలూరులో మాత్రం బోడె ప్రసాద్ వల్ల టీడీపీ స్ట్రాంగ్ అయ్యింది. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులని గమనిస్తుంటే బోడె ప్రసాద్ ఫామ్ లోకి వచ్చినట్లు కనిపిస్తుంది. ఇదే జోరు కొనసాగితే భవిష్యత్తులో పార్థసారథికి బోడె చెక్ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: