రాష్ట్రాభివృద్ధి కోసమని చెప్పి సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. అమరావతినే రాజధానిగా ఉండాలని పోరాటాలు చేస్తూ వస్తోంది. అలాగే అమరావతి రైతులు కూడా 200 రోజులుపై నుంచి ఉద్యమం చేస్తున్నారు. అయితే అమరావతి కమ్మ నేతల రాజధాని అని వైఎస్సార్‌సీపీ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూ వస్తోంది.

 

అసలు ఉద్యమాన్ని కమ్మ నేతలే నడిపిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. దీని వల్ల అమరావతి చుట్టూ పక్కల కాస్త వైఎస్సార్‌సీపీకి అనుకూల వాతావరణం లేకుండా పోయింది. కానీ ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్న కమ్మ నేతలకు జగన్ ఎప్పటికప్పుడు చెక్ పెట్టుకుంటూనే వస్తున్నారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని, అక్కడ భూములని అభివృద్ధి చేసి రైతులని ఆదుకుంటామని హామీ కూడా ఇచ్చారు. దీంతో అమరావతిలో పరిస్థితులు కాస్త మారినట్లే కనిపిస్తున్నాయి.

 

ఇక ముందు ఉన్నట్లుగా అమరావతి ఉద్యమంలో అంత ఉధృతి కనపడటం లేదు. ఈ క్రమంలోనే అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న కమ్మ టీడీపీ నేతలకు చెక్ పెట్టే విధంగా జగన్ ముందుకెళుతున్నారు. అందులో భాగంగానే, అమరావతికి అటు ఇటు ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్న కమ్మ నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే కృష్ణాలో వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ లాంటి వారిని వైఎస్సార్‌సీపీలోకి తీసుకొచ్చారు.

 

అటు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే. ఇక తాజాగా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. త్వరలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి రాబోతుంది. ఈ విధంగా అమరావతికి దగ్గరలో ఉండే కమ్మ నేతలకు వరుస ప్రాధాన్యం ఇస్తూ, అదే సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలకు ఊహించని విధంగా చెక్ పెట్టేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: