2019 ఎన్నికల్లో జగన్ సృష్టించిన సంచలనం ఎప్పటికీ మరిచిపోవడం కష్టం. అలాగే జగన్ దెబ్బకు టీడీపీ కూడా చరిత్రలో లేని విధంగా ఓటమి పాలవ్వడం కూడా మరవలేము. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక, టీడీపీకి ఏ మాత్రం కోలుకునే అవకాశం ఉండటం లేదు. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు తమ పార్టీలోకి తీసేసుకున్నారు. దీంతో పలు నియోజకవర్గాల్లో అసలు టీడీపీ ఉందా? లేదా అనే అనుమానాలు వస్తున్నాయి.

 

పైగా కొన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబుకి సరైన నాయకుడు కూడా దొరకడం లేదు. అలా నాయకులు లేకుండా టీడీపీకి దిక్కులేని నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గాలు ముందున్నాయి. 2019 ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి తోట త్రిమూర్తులు టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయి, ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిపోయారు.

 

ప్రస్తుతం ఆయన మండపేట వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇక త్వరలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇక టీడీపీని వీడిన తోట రాజకీయ జీవితం బాగానే ఉంది. కానీ రామచంద్రాపురంలో టీడీపీని ఆదుకునే నాయకుడే లేకుండా పోయాడు. తోట బయటకొచ్చేయడంతో ఇక్కడ టీడీపీకి నాయకత్వం లేకుండా పోయింది. ఎమ్మెల్యేగా పోటీ చేసే స్టామినా ఉన్న నేతలు ఎవరు లేరు. అందుకే చంద్రబాబు ఇంకా ఇక్కడ ఇన్‌చార్జ్‌ని నియమించలేదు.

 

అటు కొవ్వూరు వచ్చేసరికి 2014 ఎన్నికల్లో జవహర్ టీడీపీ తరుపున గెలిచి, మంత్రిగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు జవహర్‌ని కృష్ణా జిల్లా తిరువూరు పంపించారు. అలాగే విశాఖలోని పాయకరావుపేట నుంచి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనితని 2019 ఎన్నికల్లో కొవ్వూరుకు పంపారు. అయితే జగన్ సునామీలో ఇద్దరు ఓడిపోయారు. ఓడిపోయాక అనితకు మళ్ళీ పాయకరావుపేట బాధ్యతలు అప్పగించేయగా, జవహర్ తిరువూరులోనే ఉన్నారు.

 

దీంతో కొవ్వూరులో టీడీపీని నడిపించే నాయకుడు లేడు. పైగా అక్కడ ఉన్న గ్రూపు రాజకీయాలు వల్ల టీడీపీ ఇంకా వీక్ అయిపోతుంది. మొత్తానికైతే ఎన్నికల్లో జగన్ కొట్టిన దెబ్బకు ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు చేతులెత్తేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: