కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏమిచ్చింది అన్నది ఈ తరానికి తెలియదు. కానీ చరిత్ర ఒక్కసారి తిరగేస్తే కాంగ్రెస్ ఏమిచ్చిందో తెలుస్తుంది. కాంగ్రెస్ కొన్ని భ్రష్టాచార పనులు చేసి ఉండవచ్చు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కులం, మతం వంటి రంగులు కూడా చిమ్మి జనం మధ్య కొంత విభేదాలు క్రియేట్ చేసి ఉండవచ్చు. కానీ కానీ ఈ దేశం సామాజిక భౌగోళిక స్వరూపాన్ని అర్ధం చేసుకున్న ఏకైక‌ పార్టీ కాంగ్రెస్ మాత్రమే.

 

అలాగే ఈ దేశ రాజకీయాన్ని, ఆర్ధిక స్వరూపాన్ని కూడా పూర్తిగా అర్ధం చేసుకుంది. ఆసేతు హిమాచలం కాంగ్రెస్ పార్టీ ఆవరించి ఉంది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్లేస్ లో అంతటి పార్టీ మరోటి లేదు, ప్రతీ పల్లెల్లో కాంగ్రెస్ కి  ఈ జనరేషన్లోనూ కొన్ని ఓట్లు ఉన్నాయి. అలాంటి ఘనత మరే పార్టీకి లేదు. బీజేపీ ఈ దేశాన్ని ఏలవచ్చు, కానీ కాంగ్రెస్ మాదిరిగా దేశం మారుమూలల్లోకి చొచ్చుకుపోయిన సందర్భం లేదు. ఉత్తరాది పార్టీగానే ముద్ర బీజేపీకి శాపమే.

 

దానికి కారణం బీజేపీ సిధ్ధాంతం. బీజేపీ అందరి పార్టీగా ఎదగలేకపోతోంది. అదే కాంగ్రెస్ లో అన్ని వర్గాల వారు ఇమిడిపోగలరు. అందరికీ అవకాశాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ లోనే ఒక అగ్ర కులస్థుడు. మరో బడుగు జీవి కలసి పనిచేయగలరు, ఇద్దరూ అందలాలు ఒకేసారి  ఎక్కగలరు. 

 

అటువంటి కాంగ్రెస్ పార్టీ చూస్తూండగానే కుప్ప‌ కూలిపోవడం బాధాకరమే. కాంగ్రెస్ ఉనికి కోల్పోతే ఆ నష్టం కేవలం ఆ పార్టీది మాత్రమే కాదు, ఈ దేశానికి కూడా తీరని నష్టంగా చెప్పాలి. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా ఎక్కువ. మిగిలిన పార్టీలతో పోలిస్తే స్వేచ్చగా అక్కడ నాయకులు మాట్లాడగలరు. 

 

ఇపుడు ఉన్న ఏ పార్టీలో  చూసినా మూతికట్టేసేన  నియంతల‌ పాలనే కనిపిస్తోంది. ఇక అన్ని వర్గాలకు అవకాశలు ఇచ్చే పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఈ దేశంలో బలంగా ఉండాలి. వీలు అయితే మళ్ళీ అధికారంలోకి కూడా రావాలి. ఓడిపోతే తప్పు అని ఆ పార్టీని సమాధి చేయాలని చూడడం ప్రజాస్వామ్యం కాదు, అది ఎవరు చేసినా తప్పే. ఇక కాంగ్రెస్ భవిష్యత్తు  విషయంలో రాహుల్ గాంధీ బాధ్యత తీసుకోవాలి. మళ్ళీ కాంగ్రెస్ రధాన్ని నడిపించాలి. కచ్చితంగా ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ కి రాహుల్ కి ఒక అవకాశం ఇస్తారు. వేచి ఉండాలి ఆ రోజు కోసం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: