కొడుకు ఉపాధి కోసం దేశంకాని దేశం  పోయిండు.. ఆడా  ఎట్లున్నాడో  ఏమో.. టైం కి తింటున్నడో లేదో.. ఎప్పుడూ మమ్మల్ని బాగా చూసుకోవాలనే  చింత తప్ప... వాడి ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోడు..  అంటూ విదేశాలకు ఉపాధి కోసం వెళ్లిన కొడుకు గురించి ఆ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కానీ ఆ తల్లిదండ్రులకు అంతలోనే గుండెలు పగిలే  వార్త చెవిన పడింది. అమ్మ నేను చనిపోతున్నాను... అంటూ వాయిస్ రికార్డ్ చేసి ఆ యువకుడు ప్రాణాలను వదిలాడు. దీంతో ఆ తల్లిదండ్రుల రోధన అందరిని కంటతడి పెట్టించింది. ఈ ఘటన బెహ్రెయిన్ లో జరిగింది.



జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ కు చెందిన విట్టల వెంకటి, లక్ష్మి దంపతుల కు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు. కొడుకు నవీన్ ఆరు నెలల క్రితం ఉపాధి కోసం బెహ్రెయిన్  వెళ్ళాడు. విదేశాల్లో మంచి ఉద్యోగం చేసి ఇంటి బాధ్యతలు అన్నీ తానే తీసుకోవాలని అనుకున్నాడు. అంతలో ఏమైందో కానీ... ఇటీవలే   తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఆత్మహత్యకు ముందు నవీన్ తన ఫోన్ లో  వాయిస్ రికార్డ్ చేసి దాన్ని తల్లికి పంపాలని స్నేహితున్ని  కోరాడు. తాను పని చేయడం చేతకాక చనిపోవడం లేదని.. ఏదో తెలియని బాధ మనసును తొలిచేస్తుంది అంటూ ఆ యువకుడు చెప్పుకొచ్చాడు... బాధ నిండిపోయిన స్వరంతో అక్కలు నాన్నను మంచిగా చూసుకో అమ్మ... నేను చనిపోయినందుకు ఏడవద్దు అంటూ వాయిస్ రికార్డు చేసి ప్రాణాలు వదిలాడు యువకుడు.



అయితే నవీన్ ఎందుకు చనిపోయాడు అన్నది ప్రస్తుతం మిస్టరీగా మారిపోయింది. కరోనా  భయంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది ఎవరికీ తెలియరాలేదు. ఇక తన కొడుకు చివరి చూపునైనా  దక్కించాలి  అంటూ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ను ఆశ్రయించారు నవీన్ తల్లిదండ్రులు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: