ఇప్పుడంతా క‌రోనా మ‌హ‌మ్మారి గురించే చ‌ర్చ. ఈ స‌మ‌స్య ఎంద‌రో జీవితాల‌ను రోడ్డున ప‌డేసింది. అనేక‌మంది జీవితాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసేసింది. తాజాగా దీని గురించి ఓ సంచ‌ల‌న నిజం వెలుగులోకి వ‌చ్చింది. క‌రోనా కట్టడి కోసం అమలుచేసిన లాక్‌డౌన్‌ వల్ల తెలంగాణ ప్రజలు దాదాపు రూ.70 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయారని,  సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) అంచనావేసింది. రాష్ట్ర జీఎస్డీపీలో 7.9%గా ఉన్న ఈ న‌ష్టాన్ని మ‌రింత విశ్లేషిస్తూ లాక్‌డౌన్‌లో రోజుకు రూ.1,784 కోట్లు నష్టం.

 

కోవిడ్ మ‌హ‌మ్మారి, లాక్ డౌన్ వ‌ల్ల తెలంగాణ‌లోని ప‌లు వ్యాపారాలు పెద్ద ఎత్తున దెబ్బ తిన్నాయ‌ని సెస్ విశ్లేషించింది.   పట్టణ ప్రాంతాల్లో కీలకమైన నిర్మాణ, ఉత్పాదక రంగాలు నూరుశాతం లాక్‌డౌన్‌ ప్రభావానికి గురయ్యాయని పేర్కొంది. వీటితోపాటు గనులు, క్వారీలు కూడా నష్టపోయాయని నివేదిక తెలిపింది. మొత్తంమీద రాష్ర్టానికి లాక్‌డౌన్‌ కాలంలో దాదాపు రూ.70,000 కోట్లు నష్టం వచ్చిందని పేర్కొంది. ముఖ్యంగా ఉత్పాదక, వ్యాపార, మరమ్మతు సేవలు, రియల్‌ ఎస్టే రంగాలు రోజుకు రూ.1200 కోట్లు నష్టపోయాయని తెలిపింది. 2019-20 జీఎస్‌డీపీని పోల్చుకొంటే, 7.9 శాతం నష్టం ఉంటుందని అంచనా వేసింది. అదే స‌మ‌యంలో లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని సెస్ రిపోర్టు తేల్చిచెప్పింది. మాన్యుఫాక్చరింగ్‌, ఎంఎస్‌ఎంఈ, సర్వీసు రంగాలతోపాటు రియల్‌ రంగంపై ఆధారపడ్డ కార్మికులు, ఉద్యోగులు తీవ్రంగా ప్రభావితమయ్యార‌ని విశ్లేషించింది. 

 

స‌హ‌జంగా, ఏ విపత్కర పరిస్థితి వచ్చినా  మొదటగా ప్రభావితమయ్యేది దినసరి కూలీలే. లాక్‌డౌన్‌ సమయంలో పనులు లేకపోవడంతో వీరికి ఉపాధి లేకుండా పోయిందని రిపోర్టు స్ప‌ష్టం చేసింది. పట్టణాల్లోని 40 శాతం కార్మికుల్లో 13% దినసరి కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారు. నిర్మాణరంగంలో పనిచేస్తున్న 13,08,535 కూలీలు ఈ మేర‌కు త‌మ ఉపాధి న‌ష్ట‌పోయార‌ని స్ప‌ష్ట‌మైంది. 19.85 లక్షల మంది వ్యవసాయరంగంలో పనిచేస్తుండగా, 12.06 లక్షల మంది వ్యవసాయేతర రంగంలో పనిచేస్తున్నారు. వ్యవసాయేతర రంగాల్లో పనిచేసే కార్మికులు లాక్‌డౌన్‌ కాలంలో ఉపాధి కోల్పోయారని స్పెస్ విశ్లేషించింది. స్థూలంగా చూసుకుంటే ప్రభుత్వానికి నేరుగా ఒక్క రోజుకు రూ.178.4 కోట్లు, మొత్తం లాక్‌డౌన్‌ సమయంలో రూ.7 వేల కోట్లు నష్టపోయిందని సెస్‌ అంచనా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: