దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు వైరస్ భారీన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా సోకిన వాళ్లలో చాలామంది ఆక్సిజన్ విషయంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరోనా సోకుతుందనే భయం ఉన్నవాళ్లు సైతం ఇదే తరహా టెన్షన్ కు గురవుతున్నారు. 
 
అయితే వైద్యులు మాత్రం కరోనా సోకిన వాళ్లలో కేవలం 5 శాతం మందికి మాత్రమే ఆస్పతుల్లో ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుందని... దీని గురించి ప్రజలు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లలో 95 శాతం వరకు ఆక్సిజన్ నిల్వలు ఉంటాయని.... అనారోగ్యంపాలైన వాళ్లలో 90 శాతానికి అటూఇటుగా ఉంటాయని ఈ శాతం కంటే తగ్గితే వైద్యున్ని సంప్రదించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. 
 
ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రమే 85 శాతం కంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయని అలాంటివాళ్లు తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు, 60 సంవత్సరాలు దాటిన వాళ్లు ఆక్సిజన్ స్థాయిలను చెక్ చేసుకుంటూ ఉంటే మంచిదని సూచిస్తున్నారు. డిజిటల్‌ పల్సాక్సీ మీటర్ల సహాయంతో ఆక్సిజన్ లెవెల్స్ ను సులభంగా చెక్ చేసుకోవచ్చు. 
 
ప్రాణాయామం, నడక ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచుకోవడం సాధ్యమవుతుంది. శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే ప్రమాదాన్ని ముందే ఊహించి జాగ్రత్తలు తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు దేశంలో ఒక్కరోజే 29,429 కేసులు నమోదు కాగా 582 మంది మృతి చెందారు. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఏపీలో గత నాలుగు రోజుల నుంచి భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రభుత్వం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తోంది. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: