అప్పు ఇచ్చువాడు వైద్యుడు అంటే  లాజిక్ బాగా  తెలిసిన పెద్దాయన ఏకంగా డాక్టర్నే అప్పు అడిగాడట. నిజంగా జీవితంలో అప్పు ఇచ్చేవాడు పక్కన  ఉండడం అవసరం. ఎందుకంటే ఏ కష్టం ఎపుడు ముంచుకువస్తుందో ఎవరికి తెలుసు. అది వ్యక్తి అయినా వ్యవస్థ అయినా, ఆఖరుకు ప్రభుత్వమైనా అప్పు తెచ్చుకోవాల్సిందే.

 

అసలే అప్పుతోనే పుట్టిన కొత్త రాష్ట్రం ఆంధ్రాకు అప్పుల తిప్పలు గత ఆరేళ్ళుగా తప్పడంలేదు. చంద్రబాబు సర్కార్ తన అయిదేళ్ళ పదవీ కాలంలో దాదాపుగా మూడు లక్షల కోట్లు అప్పుగా తెస్తే ఏడాది వైసీపీ పాలనలో 84 వేల కోట్లు అప్పులు తెచ్చారని టీడీపీ నేతలు ఆరోపీస్తున్నారు. అయితే ఏపీ ఆరేళ్ళు అయినా ఇంకా కుదురుకోలేదు.

 

గట్టిగా చెప్పుకుంటే ఇప్పటికీ ఏపీకి  రాజధాని లేదు, బాబు గారి రాజధాని అమరావతి గ్రాఫిక్స్ లో భద్రంగా ఉంటే జగన్ మూడు రాజధానుల కధ కూడా అలాగే ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే మధ్యలో కరోనా వచ్చేసి మొత్తం కాటేసింది.కనీసంగా కూడా పన్నుల ద్వారా ఏపీకి ఆదాయమేదీ రావడం లేదు. కేంద్రం నిధులు ఇస్తుంది అని ఎంత తక్కువ ఆశలు పెట్టుకుంటే అంత మంచిదిగా సీన్ ఉంది. దాంతో అప్పు కోసం దేశమంతా తిరిగిన వైసీపీ సర్కార్ ఏకంగా అమెరికా దాకా వెళ్ళిందని లేటెస్ట్ టాక్.

 

అమెరికాలోని ఒక ప్రైవేట్ ట్రస్ట్ కి చెందిన సంస్థ  ఏపీకి అప్పులు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారంగా ఉంది. ఈ విదేశీ సంస్థ నుంచి ఏపీకి తొమ్మిది వేల కోట్లు అప్పు పుట్టే అవకాశం ఉందని అంటున్నారు. అదే సమయంలో నాలుగు శాతం వడ్డీతో నలభయ్యేళ్ల కాలపరిమితితో ఇస్తారని అంటున్నారు. అయితే ఈ విదేశీ రుణానికి కేంద్రం గ్యారంటీ ఉండాలి. మరి ఈ అప్పు తీసుకోవడానికి ఏపీ రెడీ, ఇవ్వడానికి ఆ  సంస్థ  రెడీ కానీ కేంద్రం విదేశీ సంస్థల నుంచి అప్పులు తీసుకోవడానికి అనుమతిస్తుందా అన్నదే ఇక్కడ చర్చ. 

 

ఈ విషయమై చర్చించేందుకే  హడావుడిగా ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారని అంటున్నారు. మరి చూడాలి ఈ అప్పు వస్తేనే ఏపీ కొంత వరకూ కోలుకుంటుందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: