దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ నియంత్రణ సాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు వైరస్ ను కట్టడి చేసే వ్యాక్సిన్ ను తయారు చేయడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. 
 
రెండు రోజుల క్రితం రష్యా తొలి దశ క్లినికల్ ట్రయల్స్ లో సక్సెస్ అయినట్లు ప్రకటన చేయగా తాజాగా అమెరికాకు చెందిన బయోటెక్ కంపెనీ మోడర్నా మానవులపై జరుపుతున్న తొలి దశ క్లినికల్ ట్రయల్స్ లో అద్భుత ఫలితాలు సాధించింది. ఈ టీకా వల్ల మనుషుల్లో దుష్ప్రభావాలు అంతగా లేవని తేలడంతో అతి త్వరలో వైరస్ నియంత్రణ సాధ్యమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
మార్చి నెల 16వ తేదీన మోడర్నా తొలి దశ పరీక్షలను ప్రారంభించింది. 45 మంది వాలంటీర్లలో వైరస్ నిర్వీర్యం చేసే యాంటీబాడీలు తగిన స్థాయిలో తయారైనట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. తొలి దశ పరీక్షల్లో 55 ఏళ్ల పైబడిన వారిని కూడా భాగం చేస్తూ సంస్థ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం గమనార్హం. మోడర్నా తొలి దశ ప్రయోగాలలో ఉండగానే మే నెలలో ఫేజ్ 2 పరీక్షలను ప్రారంభించింది. 
 
మోడర్నా ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు 30 వేల మంది వాలంటీర్లతో ఫేజ్ 3 పరీక్షలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన కరోనా టాస్క్ ఫోర్స్ చీఫ్ అంథొనీ ఫౌచీ మాట్లాడుతూ తొలి దశ ఫలితాలు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని..... వ్యాక్సిన్ తీసుకున్న రోగుల్లో రోగ నిరోధక శక్తి పెరిగింది కాబట్టి కరోనాపై విజయం సాధించినట్టేనని వ్యాఖ్యలు చేశారు.               
 

మరింత సమాచారం తెలుసుకోండి: