భార్య భర్తల బంధం లో నమ్మకం అనేది పునాది లాంటిది. పునాది బలంగా  ఉంటే ఇల్లు ఎలా  ధృడంగా  ఉంటుందో... నమ్మకం ఉంటేనే భార్య భర్తల బంధం కూడా అంతే ధృడంగా  ఉంటుంది. ఒకసారి సాఫీగా సాగిపోతున్న దాంపత్య జీవితం లోకి అనుమానం అనే  పెనుభూతం ఎంట్రీ ఇచ్చింది అంటే... ఇక అంతే దాంపత్య జీవితంలో ఎన్నో కలహాలు మనస్పర్ధలు.. చివరికి ఆ అనుమానం ఎక్కడ వరకు దారితీస్తుంది అన్నది చెప్పలేకుండా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు అనుమానంతో ఏకంగా కట్టుకున్న వాళ్లని హతమార్చిన ఘటనలు  కూడా చూసాం. తాజాగా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్ల దాంపత్య జీవితంలో అనుమానం చిచ్చు పెట్టింది.. కసాయి గా మారిన భర్త భార్యను అతి దారుణంగా చంపాడు. 

 

 విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. బొబ్బిలి మండలం కలవరాయి గ్రామానికి చెందిన లక్ష్మణ పార్వతీపురానికి చెందిన సుశీలను  20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త  లక్ష్మణ బట్టల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగా నెలలో సగం రోజులు దూర ప్రాంతాలకు వెళ్లవలసి ఉంటుంది, కానీ ఇటీవలే లాక్ డౌన్ కారణంగా మూడు నెలల నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే 20 ఏళ్లుగా కలిసి ఉంటున్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు  భర్త లక్ష్మణ. ప్రతిరోజు భార్యను సూటిపోటి మాటలు అంటూ గొడవకు దిగేవాడు. 

 

 వీరి విషయం పలుమార్లు గ్రామ పెద్దల వరకు వెళ్ళింది. గ్రామ పెద్దలు హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. వ్యాపారం  కాస్త లాక్ డౌన్ కారణంగా దివాలా తీయటం తో ప్రస్తుతం పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తలిద్దరూ పొలం పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లగా... మరోసారి భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన భర్త  లక్ష్మణ తన చేతిలో ఉన్న గడ్డపారతో భార్య తల మెడ పై బలంగా కొట్టాడు. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.  ఇది గమనించిన పక్క  పొలంలో ఉన్న రైతులు వెంటనే సుశీలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం విజయనగరం ఆసుపత్రికి తరలించాలని చెప్పగా..  ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది సుశీల.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: