హైదరాబాద్ న‌గ‌రంలో న‌లువైపులా స‌మాన అభివృద్ధి జ‌ర‌గాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అంటున్నారు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. తూర్పు హైదరాబాద్‌కు మరిన్ని ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు.  30 వేల మంది ఉద్యోగులు పనిచేసేందుకు అవకాశం లభిస్తుందన్నారు.   ఐటీ పరిశ్రమల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిగిన ఆయన  5 కంపెనీలకు ఐటీ పార్కులు, కార్యాలయాల డెవలప్‌మెంట్ పత్రాలు అందజేశారు.

 

ఐటీ వృద్ధిలో జాతీయ స‌గ‌టు కంటే రాష్ట్ర స‌గ‌టు ఎక్కువ‌గా ఉన్నద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్‌లో ఐటీ పురోగ‌తి బాగుంద‌ని చెప్పారు. ఉప్పల్ లో జ‌రిగిన హైద‌రాబాద్ గ్రిడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... న‌గ‌రంలో న‌లువైపులా స‌మాన అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు.

 

న‌గ‌రం తూర్పువైపున ఉన్న ఉప్పల్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నద‌న్నారు మంత్రి కేటీఆర్. సిటీ లోప‌ల ఉన్న ప‌రిశ్రమ‌ల‌ను న‌గ‌రం వెలుప‌ల‌కు త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని చెప్పారు. ఎంఎంటీఎస్ ను రాయ‌గిరి వ‌ర‌కు పొడిగించేందుకు ప్రణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని తెలిపారు కేటీఆర్.

 

 నగరంలో మౌలిక సదుపాయాలతోపాటు వ్యాపార, వాణిజ్య అవకాశాలు కూడా పెరగాల్సి ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మరో 25 లక్షల చదరపు అడుగులు ఐటి కార్యాలయ స్పేస్ అందుబాటులోకి రానుందని తెలిపారు. త్వరలోనే హైదరాబాద్ గ్రోత్ ఇన్ డిస్పర్శన్ కార్యక్రమ మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్.

 

మొత్తానికి కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. భాగ్యనగరంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు అహర్నిశలూ కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే నగరంలో మరిన్ని ఐటీ పరిశ్రమలు వచ్చేలా తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇపుడు అవి కార్యరూపం దాలుస్తుండటంతో  హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వ లక్ష్యాలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయన్నారు. ఈ ఐటీ పరిశ్రమలు నెలకొనడం ద్వారా నిరుద్యోగ సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: