పేదరికంలో ఉన్నా సరే.. కృషీ.. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవొచ్చు అని ఎంతో మంది నిరూపించారు.  ఉన్నత చదువులు చదివి తమ కుటుంబానికే కాదు దేశానికి వన్నె తెచ్చారు.  ఇటీవల మధ్యప్రదేశ్ బోర్డు ప్రకటించిన 10వ తరగతి ఫలితాల తరువాత రోశ్ని భడోరియా వెలుగులోకి వచ్చింది. రోశ్ని పదో తరగతిలో 98.5 శాతం మార్కులు సాధించింది.  పేదరికంలో ఉంటూ దీక్షగా చదివి ఈ బాలిక 98.5 శాతం  మార్కులు తెచ్చుకోవడం అందరినీ సంతోష పరిచింది.  మొదటి నుంచి చదువుపై శ్రద్ద చూపిస్తున్న రోశ్ని భడోరియా గంటల తరబడి చదువుకోవడమే కాకుండా, ప్రతిరోజూ 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన పాఠశాలకు సైకిల్‌పై వెళ్లి వచ్చేది.

 

ఈ విధంగా రోశ్ని 24 కి.మీ సైకిల్ తొక్కేది. ఈ బాలిక దీక్షకు మెచ్చి మధ్యప్రదేశ్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి ఇమ్రాతి దేవి రోశ్ని పట్టుదలను గుర్తించి ఈ విభాగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తామని ప్రకటించారు. ప్రతి ఒక్కరూ రోశ్నిని ఆదర్శంగా తీసుకొని విద్యనభ్యసించాలని అన్నారు.  ఈ నేపథ్యంలోనే రోశ్నీ భడోరియాని  మహిళా, శిశు అభివృద్ధి శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు.

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చదువుకోవాలనే పట్టుదల ఉంటే కష్టమైన పని కూడా సులభంగా అవుతుందని అందుకు రోశ్ని ఒక ఉదాహరణ అని ఆమె అన్నారు. కొన్ని కారణాల వల్ల లక్ష్యాలను చేరుకోలేని అమ్మాయిలందరికీ ఇప్పుడు రోశ్ని రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు.  ఈ సందర్భంగా రోశ్ని మాట్లాడుతూ.. తనకు చదువు అంటే ఎంతో ఇష్టమని.. ఉన్నత విద్యనభ్యసించాలన్నదే తన లక్ష్యమని తెలిపింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: