పొరుగున ఉన్న పాకిస్థాన్‌తో భార‌త్‌ను పోల్చ‌డం ఏ కోణంలో చూసినా స‌రైంది కాదు. ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయా దేశాల అభిప్రాయం. మ‌న ప్ర‌జ‌ల భావ‌న కూడా. అనేక అంశాల్లో మ‌న దేశం గొప్ప స్థానంలో ఉంటుంద‌న్న‌ది నిజం. ఈ విధాన‌మే తాజాగా పాక్‌కు రోల్ మోడ‌ల్ అయింది. భార‌త్ ఫార్ములాను ఫాలో అవ్వాలంటూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. మొబైల్ ఫోన్ వీడియో అప్లికేషన్‌ను వెంటనే నిషేధించాలని కోరుతూ లాహోర్ హైకోర్టులో ఓ పౌరుడు పిటిషన్‌ దాఖలు చేశారు. టిక్ టాక్ అశ్లీల చిత్రాల  వ్యాప్తికి మూలంగా మారిందని, ఈ యాప్‌ వల్ల ఇప్పటివరకూ 10 మందికి చనిపోయారని వివరించారు. టిక్ టాక్ నిషేధంపై పెండింగ్‌లో ఉన్న ఈ పిటిషన్‌ అత్యంత ప్రాధాన్యతగలదని, త‌క్ష‌ణ‌మే విచారించి ఆదేశాలు ఇవ్వాల‌ని పేర్కొంటూ ఆ పౌరుడి తరఫున అడ్వొకేట్‌ నదీం సర్వర్‌ కోర్టు దృష్టికి తెచ్చాడు.

 


అశ్లీలత, అనుచితమైన కంటెంట్‌తోపాటు ప్రజలను అపహాస్యం చేసేందుకు ఈ యాప్‌ ఉపయోగప‌డుతోంద‌ని స‌ద‌రు పిటిష‌న‌ర్ పేర్కొన్నాడు. టిక్‌టాక్‌లో పరిచయమైన స్నేహితుల బృందం ఓ బాలికపై సామూహిక లైంగికదాడి చేసిన సంఘటనను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. టిక్‌టాక్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై ఇప్పటివరకూ విచారణ జరుగలేదని న్యాయవాది నదీం సర్వర్‌ కోర్టుకు తెలియజేశారు. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

 

కాగా, టిక్‌టాక్‌పై భారత్‌ నిషేధం విధించగానే, అమెరికా సహా పలు దేశాలూ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. టిక్‌టాక్‌ నిషేధంపై అగ్రరాజ్యం అమెరికాలో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డాన్స్‌ సమూలమైన సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. చైనా వెలుపల ప్రత్యేక ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు టిక్‌టాక్‌ ప్రతినిధులు సన్నద్ధమైనట్లు సమాచారం. టిక్‌టాక్‌ ప్రధాన కార్యాలయ వ్యవహారాలను చైనా రాజధాని బీజింగ్‌ నుంచి తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అలాగే, అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు చైనాకు చెందిన టిక్‌టాక్‌ మాజీ చీఫ్‌ అలెక్స్‌ జూ, లాస్‌ ఏంజిల్స్‌ కేంద్రంగా పనిచేసే కొత్త సీఈవో కెవిన్‌ మేయర్‌కి బాధ్యతలను అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: