భాగ్యనగర మణిహారం మెట్రోనూ తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది కరోనా. జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతున్న మెట్రో రైలుకి నాలుగు నెలలుగా బ్రేకులు పడ్డాయ్‌. నష్టాల ఊబి నుంచి గట్టెక్కించాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంది ఎల్ అండ్‌ టీ. ఇప్పటికే నెలకు 50 కోట్ల చొప్పున 200 కోట్లు నష్టపోయామని ప్రభుత్వానికి లేఖ రాసింది. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వలేదంటోందీ హెచ్ ఎమ్ఆర్. 

 

మెట్రో రైలు.. గ్రేటర్‌ హైదరాబాద్‌కు మాత్రమే కాదు తెలంగాణాకే మణిహారం. రాష్ట్రానికే ప్రత్యేకత తీసుకొచ్చిన ఆధునిక రవాణాసౌకర్యం. కోటిమంది ప్రజలు నివసించే భాగ్యనగరంలో.. ప్రజలను ట్రాఫిక్‌ కష్టాల నుంచి బయటపడేసింది. అలాంటి మెట్రోకి కరోనాతో బ్రేకులు పడ్డాయ్‌. మార్చి 22 నుంచి నేటి వరకూ పట్టాలెక్కలేదు. ఎప్పుడెక్కుతుందో కూడా స్పష్టత లేదు.

 

నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో సీటి బస్సులకే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. మెట్రో పరిస్థితి కూడా దాదాపు ఇదే. లాక్‌డౌన్ ముందు వరకు నాగోల్‌-రాయదుర్గం, జేబీఎస్‌- ఎంజీబీఎస్‌, ఎల్బీనగర్‌-మియాపూర్‌ రూట్లలో మెట్రో పరుగులు పెట్టేది. నిత్యం 4 నుంచి ఐదు లక్షల మంది అందులో గమ్యస్థానాలకు చేరేవాళ్లు. దీంతో సుమారు 50 కోట్ల ఆదాయం లభించేది. జీతభత్యాలు, డిపోల నిర్వహణతో 200 కోట్ల రూపాయల మేర ఇప్పటికే నష్టపోయింది. దీంతో చేసేదేమి లేక ప్రభుత్వానికి మొరపెట్టుకుంటుంది హెచ్ ఎమ్ ఆర్. నష్టాన్ని భర్తీ చేసేలా సాయం చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసింది.

 

మెట్రో రైలు నిర్మాణ ఒప్పందం ప్రకారం.. ఆ సంస్థ చేసిన వ్యయాన్ని 35 ఏళ్ల పాటు చార్జీలు, వ్యాపార వాణిజ్య స్థలాలు, రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల ద్వారా సంపాదించుకోవాలి. ప్రస్తుతమున్న పరిస్థితుల వల్ల అవేమి జరగడం లేదు. రైళ్లు నడవక పోవడంతో వ్యాపార సంస్థలు, మాల్స్ నష్టాల్లో కూరుకుపోయాయ్‌. ప్రభుత్వం మెట్రోకు పరిహారం చెల్లించకపోతే.. నిర్వాహణ ఒప్పందాన్ని మరికొంత కాలం పొడిగించక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: