వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో... పలు రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ వైపు మళ్లుతున్నాయి.  సడలింపుల తర్వాత వైరస్ వ్యాప్తి భయానకంగా మారింది. దీంతో.. కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో నేటి నుంచి పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలవుతోంది. అటు బీహార్ , పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాలు అదే బాట పడుతున్నాయి.

 

దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో చాలా రాష్ట్రాలు మళ్లీ లాక్‌డౌన్ బాటపట్టాయి. ఇప్పటికే యూపీ, కేరళ, జమ్మూకాశ్మీర్ వంటి రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి.  తొలి నుంచి కొంచెం సేఫ్ గా కనిపించిన కర్ణాటకలో సడలింపుల తర్వాత వైరస్ వ్యాప్తి భయానకంగా మారింది. దీంతో యడ్యూరప్ప సర్కారు బెంగళూరు సిటీ, శివారు ప్రాంతాల్లో ఇవాల్టి నుంచి వారంరోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ ప్రకటించింది. కలబుర్గి జిల్లాలోనూ ఇదే తరహా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 23వరకు బెంగళూరు సహా రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమల్లోకొచ్చింది.

 

బీహార్‌ కూడా లాక్‌డౌన్‌కు సిద్ధమయింది. రేపటి నుంచి ఈ నెల 31వరకు బీహార్‌లో లాక్‌డౌన్ అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో కరోనా వైరస్ ప్రవేశించిన తొలిరోజుల్లో బీహార్‌లో వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉంది. అక్కడ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉండేది. తర్వాత కాలంలో దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోలానే బీహార్‌లో కూడా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో మరోసారి లాక్‌డౌన్ అమలు చేసి కరోనాను నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది.

 

కేరళ, ఉత్తర్‌ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌లో కూడా లాక్‌డౌన్ కఠినంగా అమలుచేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలను రోడ్లపైకి అనుమతించడం లేదు.  వెస్ట్ బెంగాల్ లోని కంటైన్మెంట్ జోన్లలో ఇప్పటికే లాక్ డౌన్ 1.0 స్థాయిలో కట్టడి కొనసాగుతోంది.

 

 పలు రాష్ట్రాల్లో ఆయా జిల్లాల్లోని తీవ్రతను బట్టి పూర్తి, మధ్యస్థ లాక్ డౌన్లు విధించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నేరుగా ప్రకటించకున్నా.. వ్యాపార సముదాయాలు ఎక్కడిక్కడే సెల్ఫ్ లాక్ డౌన్ అనౌన్స్ చేస్తున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: