రాజ‌స్థాన్‌లో నెల‌కొన్న అంత‌ర్గ‌త కుమ్ములాట‌ రాజ‌కీయం కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కీల‌క రాష్ట్రమైన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ్యోతిరాదిత్య సింథియా కొట్టిన దెబ్బ నుంచి కోలుకోక ముందే కాంగ్రెస్ పార్టీకి రాజ‌స్థాన్‌లో మ‌రోదెబ్బ త‌గిలింది. డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్ సీఎం అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు చేయ‌డంతో ఆ రాష్ట్రంలో రాజ‌కీయ సంక్షోభం త‌లెత్తింది. ఇంకా కొన‌సాగుతోంది. అయితే, తాజాగా దీనిపై ఇద్ద‌రు ముఖ్యులు మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వారిద్ద‌రే కాంగ్రెస్ యువ‌నేత రాహుల్‌, రాజస్థాన్ నేత స‌చిన్ పైల‌ట్‌.

 


గ‌త కొద్దికాలంగా వార్త్ల‌లో నిలుస్తున్న స‌చిన్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న త‌న ఆవేద వెల్ల‌గ‌క్కారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి  దిగిపోయిన తర్వాత సీఎం అశోక్ గెహ్లాట్ టీం తనను లక్ష్యంగా చేసుకున్నదని సచిన్ పైలట్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు గత ఏడాదిగా పోరాటం చేస్తున్నట్లు ఆయన వాపోయారు. భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీతో కలిసి కుట్రపన్నుతున్నట్లు తనపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సచిన్ పైలట్ తెలిపారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ విజయానికి ఎంతో శ్రమించిన తాను పార్టీకి వ్యతిరేకంగా ఆ పని ఎలా చేస్తానని ఆయన ప్రశ్నించారు. 

 

 

 

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి ఏమి ప్రయోజనమని సచిన్ ప్ర‌శ్నించారు.  రాష్ట్ర అభివృద్ధి కోసం తాను, తన అనుచరులు చేపట్టదలచిన పనులను సీఎం అశోక్ గెహ్లాట్ అనుమతించడంలేదని సచిన్ ఆరోపించారు. తన ఆదేశాలను పాటించవద్దని అధికారులకు చెప్పారని, దీంతో తనకు ఫైళ్లు కూడా పంపడం లేదన్నారు. గత కొన్ని నెలలుగా క్యాబినెట్ సమావేశాలు, సీఎల్పీ భేటీలు జరుగలేదన్నారు. ఏఐసీసీ రాజస్థాన్ ఇంచార్జి, సీఎం గెహ్లాట్‌తో పాటు పలువురు సీనియర్ నేతల వద్ద సమస్యలను ప్రస్తావించినా ప్రయోజనం ఏమీ‌లేదన్నారు.  గెహ్లాట్‌పై తనకు ఎలాంటి కోపం లేదని, తాను ఎలాంటి ప్రత్యేక అధికారాలు కోరడం లేదని సచిన్ అన్నారు. ఎన్నికలప్పుడు రాజస్థాన్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నదే తన కోరిక అని చెప్పారు. తనపై ఎన్నో ఆరోపణలు చేసినప్పటికీ పార్టీకి వ్యతిరేకంగా తాను ఒక్కమాట కూడా మాట్లాడలేదని పైల‌ట్ గుర్తు చేశారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు ఎవరో చెప్పినంత మాత్రానా తాను ఆ పని చేయబోనన్నారు. తనకు చెడ్డపేరు ఆపాదించేందుకే కొందరు అలా చెబుతున్నారని వాపోయారు.

 

కాగా, రాహుల్ గాంధీ టీంకు చెందిన‌ త‌న‌ను ప‌ట్టించుకోలేద‌ని స‌చిన్ పైల‌ట్ వాపోయిన‌ప్ప‌టికీ...రాహుల్ మాత్రం మ‌రో రీతిలో రియ‌క్ట‌య్యారు. ఢిల్లీలో జ‌రిగిన‌ ఎన్ఎస్‌యూఐ స‌మావేశంలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ యువ నాయ‌కుల‌ను ఉద్దేశించి  కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్టీలో నుంచి ఇంకా వెళ్లిపోవాల‌నుకునే వాళ్లు ఎవ‌రైనా ఉంటే వెళ్లిపోవ‌చ్చు. మీ లాంటి యువ నాయ‌కుల్లో ఎవ‌రైనా బ‌య‌ట‌కు వెళ్లాల‌నుకుంటే కాంగ్రెస్ పార్టీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: