సాధినేని యామిని...టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బాగా హైలైట్ అయిన పేరు. అధికార ప్రతినిధిగా యామిని టీడీపీ తరుపున బలమైన వాయిస్ వినిపించారు. ముఖ్యంగా మీడియా డిబేట్లలో కాస్త గట్టిగానే మాట్లాడుతూ, ప్రత్యర్ధి పార్టీలకు ధీటుగానే నిలబడ్డారు. అయితే ప్రత్యర్ధుల నుంచి కూడా యామిని దారుణమైన విమర్శలని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇక ఇంతలా కష్టపడిన యామిని...పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని చెప్పి 2019 ఎన్నికల్లో తర్వాత టీడీపీకి రాజీనామా చేసి బయటకొచ్చేశారు.

 

అలాగే తనపై సొంత పార్టీ వాళ్లే...సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారని, తన మీద పార్టీలోని ఓ వర్గం కావాలని దుష్ప్రచారం చేసిందని, ఇవన్నీ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా వారు దాని గురించి పట్టించుకోలేదని చెప్పి యామిని టీడీపీని వీడారు. ఇక టీడీపీని వీడి కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న యామిని, తర్వాత బీజేపీలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆమె పెద్దగా బయటకు రాకుండా, సోషల్ మీడియా వేదికగానే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

 

అయితే యామిని మాదిరిగానే టీడీపీలో మరో మహిళా నాయకురాలు సైలెంట్ అయిపోతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ కనీసం పట్టించుకోకపోవడంతో ఆమె కూడా కాస్త పార్టీకి దూరం జరిగినట్లు తెలుస్తోంది. అలా టీడీపీకి దూరంగా జరుగుతున్న మహిళా నాయకురాలు ఎవరో కాదు...తెలంగాణ టీడీపీ నాయకురాలు రేవతి. సినీ నటి అయిన రేవతి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీలో చేరారు.

 

అప్పుడు టీడీపీ కోసం గట్టిగానే ప్రచారం చేశారు. ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయినా సరే ఇటు సోషల్ మీడియాలో అటు ఎలక్ట్రానిక్ మీడియాలో పార్టీ కోసం తన వాయిస్ బలంగానే వినిపించే ప్రయత్నం చేశారు. అయితే ఇంత కష్టపడిన తెలంగాణ తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి తిరునగరి జ్యోత్స్నాకు ఇవ్వడంతో రేవతి సైలెంట్ అయిపోయారు. మునుపటిలాగా పార్టీలో యాక్టివ్‌గా ఉండటం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: