రేవంత్ రెడ్డికి...టీడీపీతో ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ కాలంలోనే టీడీపీలో బడా నేతగా ఎదిగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుతో రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. అయితే తెలంగాణలో టీడీపీ పరిస్తితి మరీ దారుణంగా అయిపోవడంతో, రేవంత్ అయిష్టంగానే టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

 

కాంగ్రెస్‌లో చేరిన కూడా రేవంత్ మనసు టీడీపీ వైపే ఉండేది. అందుకే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్-టీడీపీ పొత్తు పెట్టుకోవడంలో రేవంత్ వెనుక ఉండి చాలానే కథ నడిపించారు. పైకి పొత్తు విషయం గురించి ఏం పట్టించుకోనట్లు ఉంటూనే...కేసీఆర్‌కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే రేవంత్...చంద్రబాబుతో ఉన్న బంధాన్ని ఉపయోగించుకుని కాంగ్రెస్-టీడీపీలు కలిసి పోటీ చేసేలా ప్లాన్ చేశారని అప్పటిలోనే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది.

 

అయితే 2018 ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ పొత్తు దారుణంగా విఫలమైంది. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ మళ్ళీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇక రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఏమైందో చూశాం. కానీ ఎలా ఉన్నా సరే రేవంత్ రెడ్డి...కేసీఆర్‌ని వదలట్లేదు. ఎప్పటికప్పుడు ఆయనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ చిక్కుల్లో పెట్టేందుకు చూస్తున్నారు.

 

కాకపోతే రేవంత్, కేసీఆర్‌పై చేస్తున్న పోరాటానికి కొందరు సొంత నేతలే సహకరించడం లేదు. ఆయన్ని ఎప్పటికప్పుడు వెనక్కి లాగాలనే చూస్తున్నారు. అసలు కాంగ్రెస్‌లో కీలకమైన పీసీసీ పదవి రేవంత్‌కి రాకుండా కొందరు సీనియర్ నేతలు తెగ కష్టపడుతున్నారు. అయితే సొంత పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఉన్నా రేవంత్...కేసీఆర్‌కు ఎలా చెక్ పెట్టాలని చూస్తూనే ఉన్నారు. అసలు నెక్స్ట్ ఎన్నికల్లో కేసీఆర్‌ని ఖచ్చితంగా ఓడించాలనే ఉద్దేశంతో ముందుకెళుతున్నారు.

 

కాకపోతే కేసీఆర్‌కు చెక్ పెట్టాలంటే కాంగ్రెస్ బలం సరిపోదని దానికి మిగతా ప్రతిపక్షాల సపోర్ట్ కావాలని రేవంత్ ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే నెక్స్ట్ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకునే రేవంత్ ముందుకెళ్లాలని వ్యూహాలు రచిస్తున్నారట. ఎలాగైనా టీడీపీతో మళ్ళీ పొత్తు ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. మరీ చూడాలి నెక్స్ట్ ఎన్నికలకు తెలంగాణలో పరిస్థితి ఎలా మారుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: