ఊహించని విధంగా మండలి రద్దు కావడంతో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు మంత్రి పదవులు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇటీవలే వీరు ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేసేశారు. కానీ వీరికి అన్యాయం జరగకుండా జగన్ వెంటనే, రాజ్యసభ పదవులు కూడా ఇచ్చేశారు. అయితే ఖాళీ అయిన మంత్రి పదవులని భర్తీ చేసేందుకు జగన్ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఈ క్రమంలోనే మంత్రి పదవి దక్కించుకునేందుకు పలువురు ఆశావాహులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే జగన్ మదిలో ఉన్నవారికే మంత్రి పదవులు దక్కుతాయని చెప్పడంలో ఎలాంటి మొహమాటం లేదనే చెప్పొచ్చు. అయితే ఈ మంత్రి పదవులు గురించి చర్చలు జరుగుతున్న సమయంలోనే ఓ సీనియర్ ఎమ్మెల్యే గురించి చర్చ కూడా తెరపైకి వచ్చింది. దశాబ్దాల కాలం నుంచి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆనం నారాయణ రెడ్డి ఈ మధ్య బాగా హాట్ టాపిక్ అవుతున్నారు.

 

సొంత పార్టీపైన, అధికారులుపైనే విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ని టార్గెట్ చేస్తూ ఆనం రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ విధంగా ఆనం నడుస్తున్న నేపథ్యంలో సొంత పార్టీ వాళ్ళే, ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు టీడీపీని వదిలి వైఎస్సార్‌సీపీలోకి వచ్చిన ఆనంకు, జగన్ వెంటనే సీటు కేటాయించారు. జగన్ ఇమేజ్‌తోనే ఆనం వెంకటగిరిలో భారీ మెజారిటీతో గెలిచారని, అలాంటిది ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళడం సమంజసం కాదని వైఎస్సార్‌సీపీ అభిమానులు అంటున్నారు.

 

ఆనం ఇదే విధంగా ముందుకెళితే, భవిష్యత్‌లో మంత్రి పదవి కూడా రాదని స్ట్రాంగ్ గా చెప్పేస్తున్నారు. అసలు ఎన్నికల్లో గెలిచాక మంత్రి పదవి వస్తుందని ఆనం అనుకున్నారు. కానీ జగన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో నెక్స్ట్ టర్మ్‌లో అయిన పదవి వస్తుందేమో అని ఆనం ఆశలు పెట్టుకుని ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులని బట్టి చూస్తే జగన్...ఆనంకు మంత్రి పదవి ఇవ్వడం కష్టమని తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: