గ‌త కొద్దికాలంగా తెలంగాణ‌లో పెద్ద ఎత్తున న‌మోదు అవుతున్న క‌రోనా కేసులు ఆందోళ‌న‌ను క‌లిగిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌ధాని హైద‌రాబాద్‌లో అయితే, ఓ రేంజ్‌లో కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇక మిగ‌తా ప్రాంతాల్లోనూ అదే ప‌రిస్థితి. అయితే, క‌రోనాపై పోరాటంలో తెలంగాణ‌కు తీపిక‌బురు ద‌క్కింది. నగరానికి చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్‌ సంస్థ హెటిరో గ్రూప్‌.. ‘కొవిఫర్‌' పేరుతో కొవిడ్‌-19ను కట్టడిచేసే ఔషధాన్ని ఆవిష్కరించిన సంగ‌తి తెలిసిందే. ఇది అమెరికా సంస్థ గిలియడ్‌ సైన్సెస్‌కు చెందిన యాంటీ వైరల్‌ డ్రగ్‌ ‘రెమ్‌డెసివిర్‌'కు జెనరిక్‌ వెర్షన్‌. కొవిఫర్‌ ఔషధం 9 వేల డోసులను తెలంగాణకు సరఫరా చేయనున్నట్టు హెటిరో హెల్త్‌కేర్‌ సంస్థ తెలిపింది.  ఈ నెల 20వ తేదీ లోపు ఈ మందును సరఫరా చేయనున్నట్టు వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

 


రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తికి హెటిరో సంస్థ గతంలోనే గిలియడ్‌ నుంచి లైసెన్స్‌ పొందింది. దేశంలో దీని తయారీ, మార్కెటింగ్‌కు భారత డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ (డీసీజీఐ) నుంచి అనుమతులు వచ్చాయి. కొవిఫర్‌ 100 మిల్లీగ్రాముల ఇంజెక్షన్‌ వయల్‌ రూపంలో అందుబాటులోకి రానుంది. దీనిని అన్ని వయసుల వారికి వినియోగించవచ్చని సంస్థ పేర్కొన్నది. రోగి ఏ స్థితిలో ఉన్నా దీనిని వాడవచ్చని తెలిపింది. ఒక రోగికి ఎన్ని డోసులు ఇవ్వాలన్నది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పింది. అయితే ఒక రోగికి 5-6 డోసులు ఇవ్వాల్సి రావొచ్చని సంస్థ అంచనా. ఇక తాజాగా అందుబాటులోకి రావ‌డంతో దేశవ్యాప్తంగా 60 వేల డోసులను సరఫరా చేయనున్నట్టు సంస్థ పేర్కొంది. హెటిరో 100మిల్లీగ్రాముల డోసుల రూపంలో ఔషధాన్ని సరఫరా చేస్తున్నది. ఈ 60 వేల డోసుల్లో మహారాష్ట్రకు 12,500, ఢిల్లీకి 10 వేలు పంపనున్నది. తెలంగాణకు ఇప్పటికే 14,502 డోసులను సరఫరా చేసినట్టు సంస్థ వెల్లడించింది.

 

ఇదిలాఉండ‌గా, కొవిఫర్ విష‌యంలో గ‌తంలోనే హెటిరో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కోవిఫ‌ర్‌ను చికిత్స పొందుతున్న రోగులకు వైద్యుల పర్యవేక్షణలో అందించాల్సి ఉంటుందని హెటిరో సంస్థ తెలిపింది. ఇది బయట మందుల దుకాణాల్లో దొరుకదని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొవిఫర్‌ను ప్రభుత్వం ద్వారా నేరుగా కరోనా చికిత్స అందిస్తున్న దవాఖానలకే సరఫరా చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు చెప్పింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని హెటిరో ప్లాంట్లలో కొవిఫర్‌ ఉత్పత్తి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: