దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ‌వ‌ర్గాల చూపు ఇప్పుడు రాజ‌స్థాన్‌పై ప‌డింది. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ యువ‌నేత స‌చిన్ పైలట్ త‌న దూకుడు కొన‌సాగిస్తున్నారు. గెహ్లాట్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి బహిష్కరణకు గురైన యువనేత రాజ‌కీయ ఎత్తుల‌తో ముందుకు సాగుతున్నారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ సైతం సచిన్ పైలట్ విష‌యంలో ప్ర‌ణాళిక‌బ‌ద్దంగానే ముందుకు సాగుతోంది. తాను బీజేపీలో చేరటం లేదని సచిన్ పైలట్ క్లారిటీ ఇవ్వ‌డంతో పైలట్‌ను బుజ్జగించి తిరిగి పార్టీ గూటికి రప్పించేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాహుల్‌గాంధీయే స్వయంగా రంగంలోకి దిగి పైలట్‌కు సానుకూల సందేశం పంపించార‌ని స‌మాచారం. పైలట్‌కు కాంగ్రెస్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పార్టీ కార్యదర్శి రణ్‌దీప్‌సింగ్‌ సుర్జేవాలా చెప్ప‌డం దీనికి నిద‌ర్శ‌నం.

 

తాను బీజేపీలో చేరటం లేదని యువనేత సచిన్‌పైలట్‌ ప్రకటించడంతో కాంగ్రెస్‌లో ఆశ‌లు చిగురిస్తున్నాయి. రాహుల్‌గాంధీయే స్వయంగా రంగంలోకి దిగి సచిన్‌పై బహిరంగంగా విమర్శలు చేయరాదని సీఎం గెహ్లాట్‌కు హుకుం జారీ చేసిన‌ట్లు స‌మాచారం. అయితే, గెహ్లాట్ మాత్రం త‌న ఆగ్రహాన్ని కొన‌సాగిస్తున్నారు. త‌న కుర్చీకి ఎస‌రు పెట్టిన స‌చిన్‌పై విరుచుకుప‌డుతున్నారు. ``నేను, సోనియా, రాహుల్‌ పార్టీలో కొత్తతరాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం. రేపటిరోజు వాళ్లదే కదా..! కానీ, యువ నాయకత్వమే ఇలాంటి చ‌ర్య‌లకు పాల్పడితే ఏం చేయాలి?`` అని మీడియా ముందే వాపోయారు. మంచి ఆహార్యం ఉండి, మంచి ఆంగ్లం మాట్లాడటమే సర్వస్వం కాదు. అంటూ స‌చిన్ పైల‌ట్ అందం గురించి ఎద్దేవా చేశారు. 

 


కాగా, కాంగ్రెస్ పార్టీ పైలట్‌ టీంపై ద్విముఖ వ్యూహంతో దాడి మొదలుపెట్టింది. పార్టీ విప్‌ ధిక్కరించిన సచిన్ సహా 19 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషి షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.ఇక‌ కాంగ్రెస్‌ సంక్షోభంపై మొదట దూకుడుగా వ్యవహరించిన బీజేపీ తాజా పరిణామాలతో వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: