ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను మరింత టెన్షన్ పెడుతున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 2,432 మంది వైరస్ భారీన పడ్డారు. ప్రభుత్వం నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా రాష్ట్రంలో భారీగానే కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే రెండు జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
రాష్ట్రంలో ముఖ్యంగా కర్నూలు, గుంటూరు జిల్లాలలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో మొదటినుంచి కర్నూలు జిల్లాను కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. జిల్లాలో నిన్న ఒక్కరోజే 403 కొత్త కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసుల్లో కర్నూలులోనే 120 మందికి కరోనా వైరస్ సోకడం గమనార్హం. గత ఐదురోజుల్లో నగరంలో 375 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో నంద్యాల, ఆదోని ప్రాంతాలలో కూడా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. 
 
నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. నగరంలో రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిన్న నంద్యాలలో 33 పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా బాధితుల సంఖ్య 632కు చేరింది. మరోవైపు గుంటూరు జిల్లాను సైతం కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. జిల్లాలో గత 24 గంటల్లో 468 కేసులు నమోదయ్యాయి. 
 
జిల్లాలో నమోదైన 3,824 కేసుల్లో 1829 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 1963 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేస్తోంది. కరోనా సోకిన వారికి సకాలంలో వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలో పరిధిలో చేర్చడంతో ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా వైద్యసేవలు అందనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: