తెలంగాణలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ సందర్భంగా  రాష్ట్ర  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత వైద్యానికి రాష్ట్రవ్యాప్తంగా 20 మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో 17వేలకుపైగా బెడ్స్ ఏర్పాటు చేసింది. ఇక ప్రైవేట్ ఆసుపత్రులో దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేకంగా వాట్సప్‌ ఫోన్‌ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది.  

 

తెలంగాణలో రోజురోజూకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలనుకునే వారి సంఖ్య కూడా  ఎక్కువైంది. కేసులు పెరగడంతో చికిత్సకు ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిలిచ్చారు. దీంతో అధికశాతం మంది ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటుకు పరుగులు తీస్తున్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు వసూలు చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో పేషేంట్‌ దగ్గర నాలుగైదు లక్షలు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ప్రైవేట్ దోపిడి కట్టడికి రంగంలోకి దిగింది. 

 

ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా దోపిడిని అరికట్టేందుకు ప్రత్యేకంగా డాష్ బోర్డ్‌ను ఏర్పాటుచేయాలని వైద్యాఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా వాట్సప్ నెంబర్‌ను ఏర్పాటుచేశారు. ఏదైనా సమస్య ఉంటే ... బాధితులు .. 91541 70960 నెంబర్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధికారులు ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోనున్నారు. 

 

ఇక కరోనా కేసులు పెరుగుతుండటంతో... మరికొన్ని ఆసుపత్రుల ద్వారా చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 20 మెడికల్‌ కాలేజీల్లో కరోనా చికిత్స చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. మల్లారెడ్డి, కామినేని, మమత మెడికల్ కాలేజీల్లో ఉచితంగా కరోనా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వమే ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు కరోనా ఛార్జీలు చెల్లించనుంది.

 

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉచిత పరీక్షలు, చికిత్సకు  సంబంధించిన పూర్తి విధివిధానాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాత ఈ ఉచిత సేవలను ప్రైవేటు మెడికల్ కాలేజీలకు విస్తరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: