తమిళనాడులో డబ్బుల కట్టల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. ఏపీ పొరుగు రాష్ట్రమైన త‌మిళ‌నాడులో ప‌ట్టుప‌బ‌డిన ఓ కారులో భారీగా బంగారం, న‌గ‌దు దొర‌క‌డం క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో డబ్బులు దొరికాయన్న ప్రచారంతో ప్రతిపక్షం టీడీపీ అధికార పార్టీని టార్గెట్ చేసింది. అక్రమ డబ్బులు తరలిస్తూ ఏపీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి అనుచరులు దొరికిపోయారని, ఇదంతా ఎమ్మెల్యేల దోపిడీ అంటూ ఆ పార్టీ ఆరోపిస్తోంది. అయితే, టీడీపీ నేత‌ల‌కు మంత్రి బాలినేని ఘాటు స‌వాల్ విసిరారు. త‌న ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక మచ్చ కూడా లేద‌ని పేర్కొంటూ దొరికిన డబ్బులు త‌నవి అని  టీడీపీ నేత‌ బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు నిరూపిస్తే...తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాన‌ని, రాజ‌కీయాల నుంచి కూడా త‌ప్పుకుంటాన‌ని సంచ‌ల‌న‌ ప్ర‌క‌టన చేశారు.

 

టీడీపీ యువ‌నేత‌ నారా లోకేష్‌పై  మంత్రి బాలినేని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. లోకేష్‌కు త‌న‌ను విమర్శించే స్థాయి లేద‌ని అన్నారు. బోండా ఉమకు నాపై విమర్శలు చేయ‌డానికి సిగ్గు ఉండాలంటూ ఫైర్ అయిన బాలినేని త‌నపై తప్పుడు ఆరోపణలు చేసిన బోండా ఉమ క్షమాపణలు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. త‌నపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాన‌ని వెల్ల‌డించారు. తాను తలచుకుంటే ప్రకాశం జిల్లాలో టీడీపీ లేకుండా చేస్తాను అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ‌మంత్రి బాలినేని వ్యాఖ్య‌లు ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ ఊహించ‌లేద‌ని అంటున్నారు.

 


కాగా తమిళనాడుకు చెందిన కారులో భారీగా డబ్బులు దొరకడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యాన్ని పట్టుకుని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం... పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అక్రమ సొమ్మును పట్టుకునే దమ్ముందా అంటూ ప్ర‌శ్నించారు. మంత్రులు అనుచరులు, మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో ఐదు కోట్లు పట్టుబడటాన్ని బట్టి... వైసీపీ ఎమ్మెల్యే దోపిడీ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చంటూ విరుచుకుప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: