' ఎలాగూ చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ చేయలేడు.. అది ప్రజలను మోసం చేయడానికి ఇచ్చిన హామీ తప్ప మరోటి కాదు. అదే హామీని నేను ఇచ్చిన అమలు చేయగలిగే వాడిని కాదు, అందుకే అది సాధ్యం కాదని గ్రహించి దాని జోలికి పోలేదు. అయితే చంద్రబాబు ఆ తప్పుడు హామీతో కొంతమంది ని నమ్మించగలిగాడు. తన పార్టీని అధికారంలోకి తెచ్చుకోగలిగాడు. ఇకపై వాళ్లు కొత్త గేమ్ ప్రారంభిస్తారు. రుణమాఫీ చేయాలని చంద్రబాబుకు ఉందని కానీ ఆర్ బీఐ ఒప్పుకోలేదనో, ప్రపంచబ్యాంక్ ఒప్పుకోలేదనో చెబుతూ బుకాయిస్తారు. దీనికి మీడియా కూడా జత కలుస్తుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 9లు కలిసి ప్రజలను మోసం చేసిన బాబును వెనకేసుకురావడానికి ప్రయత్నిస్తాయి..'' అంటూ తన పార్టీ సమీక్ష సమావేశంలో పరిస్థితుల గురించి విశ్లేషించాడు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు రుణమాఫీ అనే తప్పుడు హామీని ఇచ్చాడని జగన్ అభిప్రాయపడుతున్నాడు. ఆ హామీతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని అంటున్నాడు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చకపోవడంతో ఆయన అసలు రూపం బయటపడుతుందని జగన్ అంటున్నాడు. మరి బాబు అసలు రూపం బయటపడినా మీడియా దాన్ని బయటకు రానివ్వదని... ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 9లు కలిసి బాబు వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తాయని జగన్ అంటున్నాడు. అయితే ఇక్కడ జగన్ మీడియాకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. ఒకవేళ చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ చేయకపోయినా... తాకట్టులో ఉన్న రైతుల భార్యల బంగారాన్ని విడిపించకపోయినా... ప్రజల్లో అసంతృప్తి కలుగుతుంది. అసహనం పెల్లుబుకుతుంది. అందుకు తగ్గ పర్యవసనాలను ఎదుర్కోవాల్సింది కూడా చంద్రబాబు నాయుడే! ఈనాడు పత్రిక చెప్పిందనో, ఆంధ్రజ్యోతి వాదిస్తోందనో, టీవీ 9 చూపిస్తోందనో ప్రజలు బాబు ను క్షమించరు. తమకు బాబు కొన్ని హామీలు ఇచ్చాడు.. వాటిపై వాళ్లు చాలా ఆశలు పెట్టుకొన్నారు. మరి వాటిని నెరవేరుస్తాడా?లేదా? అనే విషయం గురించి ప్రజలుఆలోచిస్తారు. అప్పడు ఈనాడు ఈటీవీ కలిసి ఏం చెప్పినా, టీవీ 9 ఎంతలా వాదించినా ప్రయోజనం ఉండదు. మీడియా బతుకు ఏమిటో ప్రజలందరికీ తెలుసు. ఒకవేళ బాబు హామీలను నెరవేర్చడంలో విఫలం అయితే అది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకుతగ్గట్టుగా వాళ్లు స్పందిస్తారు. మరి ఈ విషయంలో జగన్ మీడియా మాయను మరీ ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరంలేదు. భయపడాల్సిన అవసరమూ లేదేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: