కాశ్మీర్ గూర్చి నిజాలు రాయండి. భారత్ ప్రజలకు వాస్తవాల్ని తెలపండి. రాజ్యం చేపట్టిన కాశ్మీర్ వ్యతిరేక ప్రచారాన్ని నిలవరించండి...’ అని ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ (మాడరేట్) చైర్మన్ మిర్‌వాయిజ్ డా.మోల్వీ మహమ్మద్, ముంబాయికి చెందిన 16 మంది జర్నలిస్టులతో అన్నమాటలివి. పిటిఐ, హిందుస్థాన్ టైమ్స్ జర్నలిస్టులతో వివిధ జర్నలిస్టు సంస్థల సభ్యుల సభ్యులతో కూడిన ముంబాయి ప్రెస్ క్లబ్ జులై 6న శ్రీనగర్‌లోని ఆయన నివాసం నగీన్‌లో కలుసుకున్న సందర్భంగా కాశ్మీర్ సమస్య మతపరమైనది కాదని, ప్రాంతీయ సమస్య అంతకన్నా కాదని, రాజకీయ, ఆర్థిక, మానవీయ సంబంధాలతో కూడుకున్న సమ స్య అని... కాని, వీటిని మరుగున పరిచి భారతీయులకు కాశ్మీర్ వ్యతిరేకమనే ప్రచారం జరుగుతున్నదని, నిత్యం కర్ఫ్యూలతో, హత్యలతో, మానవ హక్కుల ఉల్లంఘనలతో, రాజకీయ వాదుల, మత పెద్దల, సామాజిక కార్యకర్తల నిర్బంధంతో కాశ్మీర్ దైన్యస్థితిలో వుంది కాబట్టి, కాశ్మీర్ లోయలో స్వేచ్ఛగా పర్యటించి, వాస్తవాల్ని గుర్తించి, నిజాల్ని బయటి సమాజానికి తెలియజేయండి...’అని జర్నలిస్టు బృందంతో అన్నమాటలు తెల్లవారి కాశ్మీర్ కేంద్రంగా ప్రచురితమయ్యే అన్ని పత్రికలు పతాక శీర్షికన ప్రచురించాయి. ఇందులో భాగంగానే కాశ్మీర్ పండితుల సమస్య, ఆర్టికల్ 370 నేపథ్యం, ప్రభుత్వ అసమర్ధ పాలనపై, అవినీతిపై, అనేక రకాల కుంభకోణాలపై, మానవ హక్కుల ఉల్లంఘటనపై, ఎస్సీ, ఎస్టీల సమస్యలపై, వికలాంగుల ఉద్యోగ భద్రతపై, తప్పిపోయిన మగవారి గూర్చి, ఎన్‌కౌంటర్ల గూర్చి పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఈ కథనాలు ఇతర ప్రాంతాల పత్రికల్లో అంతగా కనపడకపోగా జాతీయ స్థాయి పత్రికల్లో ముఖ్యమైన సంఘటనలు మాత్రం చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ పండితుల మనోభావాల గూర్చి ఆగస్టు 11నాటి సంచికలో అవుట్‌లుక్ ప్రస్తావించింది. ఛిద్రవౌతున్న అక్కడి సామాజిక వ్యవస్థను ప్రత్యక్షంగా చూస్తే తప్ప, కాశ్మీర్ ఓ అందమైన స్వప్నంకాదని తేలుతుంది. అందుబాటులో లభించే గణాంకాల్ని, పత్రికల కథనాల్ని చూసినప్పుడు ఇక్కడి ప్రభుత్వ డొల్లతనం స్పష్టంగా కనపడుతుంది. 18-30 సంవత్సరాల మధ్య వయస్సుగల కాశ్మీర్ యువకుల్లో దాదాపు 48 శాతం నిరుద్యోగులే! వీరంతా వివిధ వృత్తివిద్యాకోర్సుల్ని చేసినవారు, డిగ్రీలు పొందినవారే! దీంతో సంప్రదాయంగా వస్తున్న వ్యవసాయం, కులవృత్తులు, చేతి వృత్తులు దెబ్బతినడంతో యువత మత్తుమందులకు బానిసలై జులాయిగా మారడంతో వేర్పాటువాదం లాంటి సంస్థలు వీరిని చేరదీయడం, అప్పుడప్పుడు డబ్బులిచ్చి ఉద్యమాలు చేయించడం జరుగుతున్నట్లు ఆరోపణలు వున్నాయి. ఈ లెక్కన దేశవ్యాపితంగా అయిదు మిలియన్ల మత్తుపదార్ధ బానిసలుంటే, ఒక్క కాశ్మీర్ లోయలోనే 2.11 లక్షల మంది యువత హెరాయిన్, కోకైన్, గాంజీ, భంగ్, చరాస్ లాంటి మత్తుపదార్థాలకు అలవాటుపడి వారి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. దీనికితోడు కాశ్మీర్‌కు ఇతర దేశాలతోగల 740 కిలోమీటర్ల సరిహద్దు రేఖ అందుబాటులో వుండడం ఈ మత్తు పదార్థాల రవాణాకు మరింతగా ఊతాన్నిస్తున్నది. దీన్నుంచి బయటపడడానికై ప్రభుత్వమే శ్రీనగర్ కేంద్రంగా ఉచిత వైద్య సహాయాన్ని అందిస్తున్నది. అయినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. గత సంవత్సరం శ్రీనగర్ పోలీసు కంట్రోల్ రూంకు 1441 మత్తుమందు బాధితుల కేసులు వచ్చాయంటే, కాశ్మీర్ లోయ ఎంతగా మత్తెక్కుతున్నదో తెలుస్తున్నది. నిజానికి, 1947నాటి నుంచి నేటిదాకా అక్కడి యువత వివిధ సందర్భాలలో అధిక మూల్యానే్న చెల్లించింది. దేశ విభజన సందర్భంగా, చైనా, పాకిస్థాన్ యుద్ధాల సందర్భంగా యువత సమిధలుగా మారిన ఘటనలు అనేకం! జమ్మూ, కాశ్మీర్ భారత్ యూనియన్‌లో కలిసిన నాటినుంచి, నేటి దాకా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పాలన తప్పించి, మొత్తంగా నేషనల్ కాన్ఫరెన్స్ ముసుగులో షేక్ అబ్దుల్లా కుటుంబ పాలనే సాగడం గమనార్హం! దీనికి కాంగ్రెస్ అండదండలు దండిగా లభించడంతో, అవకాశవాద రాజకీయాలకు మరింత దోహదం చేసాయి. ఇంకా చెప్పాలంటే, జమ్మూ, కాశ్మీర్‌లో వున్నన్ని రాజకీయ పార్టీలు మరే రాష్ట్రంలో కానరావు. జెకెఎల్‌ఎఫ్, జమ్మూ, కాశ్మీర్ ముస్లీం కాన్ఫరెన్స్ (జెకెఎంసి), హురియత్ కాన్ఫరెన్స్ (జిలాని) పార్టీలు తప్ప, మిగతా రాజకీయ పార్టీలన్నీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాంక్షిస్తూ ఎన్నికల్లో పోటీచేస్తున్న పార్టీలే! హురియత్ కాన్ఫరెన్స్ (ఎం) వర్గం కూడా ఆర్థికాభివృద్ధిపై దృష్టిని సారించాలని కోరుతున్నది. అయితే ఏ పార్టీ కూడా యువతను నిర్మాణాత్మకమైన ఆలోచనలవైపుగా మరల్చినట్లు కనపడడం లేదు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లాగానే, జమ్మూ, కాశ్మీర్ ప్రాంతీయ అసమానతల్ని విపరీతంగా ఎదుర్కొంటున్నది. జమ్మూకన్నా కాశ్మీర్, కాశ్మీర్‌కన్నా లడక్ వివక్షతకు గురౌతున్నాయి. ఉద్యోగ నియామకాల విషయంగా గాని, అభివృద్ధి పనుల విషయంగా గాని, నిధుల మంజూరు విషయంగా గాని సమానత్వం ఎక్కడా కానరాదు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల నియామకం, కాంట్రాక్టు పద్ధతిలోనే జరగడం, అదీ అసమానతలతో కూడి ఉంటున్నాయ. ప్రాంతాల వారిగా చూసినప్పుడు జమ్మూకు 5396, కాశ్మీరుకు 2960, లడక్‌కు 119 పోస్టుల్ని మాత్రమే మంజూరుచేచేశారు. ఒక్క జమ్మూ జిల్లాకే 1300 పోస్టుల్ని కేటాయిస్తే, కాశ్మీర్ జిల్లాకు కేవలం 80 పోస్టుల్ని మాత్రమే కేటాయించడం కొట్టచ్చే వివక్షతగా కనపడుతుంది. పిడిపి ఎంపి తారిఖ్ అమీద్‌కర్రా ఈ సందర్భంగా స్పం దిస్తూ, కనీసం జమ్మూ, కాశ్మీర్ మధ్యన 50: 50 నిష్పత్తిలో కేటాయింపులు వున్నా బాగుండేదని, కాని అలా జరగలేదని ప్రభుత్వంపై ఆరోపణ చేశారు. అలాగే జమ్మూప్రాంతానికి 429 సబ్ హెల్త్ సెంటర్లు మంజూరుకాగా, కాశ్మీర్‌కు 247 మాత్రం మంజూరుకావడం, పాఠశాలల అప్‌గ్రేడ్ జమ్మూలో 600లకు జరగ్గా, కాశ్మీర్‌లో 370, లడక్‌లో 30 పాఠశాలలకే వర్తింపచేసారు. గత మూడు సంవత్సరాలలో వీటికోసం విడుదలైన గ్రాంట్లలో కూడా వివక్షత కనపడుతుంది. జమ్మూకు 208.81 కోట్లు విడుదల కాగా, కాశ్మీర్‌కు 79కోట్లు మాత్రమే విడుదలయ్యాయ. అలాగే, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద జమ్మూకు 2,531.58 కోట్లు విడుదల చేస్తే, కాశ్మీరుకు 1554.12 కోట్లు మాత్రమే విడుదల కావడం గమనార్హం. వెనుకబడిన గ్రామాల జాబితా తయారీలో జమ్మూ ప్రాంతంలో 30 గ్రామాల్ని గుర్తిస్తే, కాశ్మీర్ ప్రాంతంలో కేవలం 8 గ్రామాల్నే గుర్తించడం జరిగింది. ప్రాణాపాయ స్థితిలో వాడే వెంటిలేటర్సును జమ్మూ ప్రాంతంలోని 34 ఆసుపత్రులకు ఇవ్వగా కాశ్మీర్ ప్రాంతానికి 16 మాత్రమే పంపిణీ చేయడం జరిగింది. ఇక బడ్జెట్ అవుట్‌లేలో కూడా తీవ్ర వివక్షత కనపడుతున్నది. గడిచిన 2011-12, 13-14 ఆర్థిక సంవత్సరాలలో జమ్మూకు వరుసగా 99.8 కోట్లు, 109.47 కోట్లు మంజూరు అయితే, కాశ్మీర్ ప్రాంతానికి 55.8 కోట్లు, 63.47 కోట్లు మాత్రమే మంజూరు అయ్యాయి. పోనీ, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా కూడా నిధులు విడుదల కావడంలేదనేది పిడిపి పార్టీ ఆరోపణ. లడక్‌తో కలుపుకొని కాశ్మీర్ లోయలో 45 అసెంబ్లీ సీట్లుండగా, జమ్మూ ప్రాంతంలో 42 వున్నాయి. ఇలా అన్ని రంగాలలో కాశ్మీర్ లోయ వివక్షతకు గురికావడంతో వేర్పాటు వాదానికి వేదికగా మారిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కాబోలు పాంథర్స్ పార్టీ మూడు ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమానికి నాందీ పలికి జమ్మూ, కాశ్మీర్, గిల్‌గిట్‌తో కూడిన లడక్‌ను విభజించి మూడు రాష్ట్రాలుగా ఏర్పర్చాలని కోరుతున్నది. పోతే పాంథర్స్ పార్టీ వ్యవస్థాపకులు ప్రొ.్భంసింగ్ కావడం గమనార్హం! ఈ పార్టీ నాయకత్వం తప్ప, మిగతా పార్టీలన్నీ కూడా ముస్లీం నాయకుల చేతుల్లో వుండడం గమనించాలి. వివిధ వృత్తి విద్యాకోర్సులకు ఎంట్రెన్సును నిర్వహించే ‘బోపి’ (ఱ్య్ఘూజూ యచి ఔ్యచిళఒఒజ్యశ్ఘ ళశఆ్ఘశషళ ఉన్ఘౄ.) ప్రతీ సంవత్సరం కుంభకోణాల్లో ఇరుక్కోవడం జరుగుతున్నది. అవినీతి పద్ధతులు పాటించి, బ్యూరోక్రాట్ల సహాయంతో మెడిసన్, ఇంజనీరింగ్ సీట్లను దొంగిలిస్తున్నారు. 2012 ఎంట్రెన్స్ సందర్భంగా మెడికల్ సీట్లల్లో జరిగిన లక్షలాది రూపాయల కుంభకోణాలకు సంబంధించిన 51 మంది నిందితుల్లో 17 మంది తప్పించుకొని పోగా, ఈమధ్యనే ఇద్దరిని మాత్రమే అరెస్టుచేసారు. ఓవైపు ఇలాంటి అసమానతలుండగా, మరోవైపు రాజ్యాంగానికి లోబడి కూడా ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు పనిచేయడం లేదు. గిరిజన వర్గానికి చెందిన గుజ్జర్లకు అందాల్సిన సీట్లను అనేక విద్యాసంస్థలు కొల్లగొడుతున్నాయని ఆరోపిస్తూ, పేరుమోసిన పది విద్యాసంస్థలపై హైకోర్టులో పిటీషన్ వేసారు. స్థానికంగా ఏర్పాటవుతున్న విద్యుత్ ప్రాజెక్టుల్లో కూడా స్థానికులను కాదని జివికె, ఎల్ అండ్ టి లాంటి బహుళ జాతి సంస్థలు ఇతర ప్రాంతాల వారికి ఉద్యోగావకాశాల్ని కల్పించడంతో, కిస్తువార్ జిల్లాలోని 850 మెగావాట్ల రాటెల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టు కార్యాలయం ముందు స్థానిక ఇంజనీర్లు నిరసన తెలిపారు. అలాగే వివిధ హాస్పిటల్స్‌ల్లో డెంటల్ సర్జన్లని అసలే నియామకం చేయడంలేదని డాక్టర్లు నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. ఇక ప్రత్యేక అవసరాల వారికి చెందిన ఒక్క పోస్టును కూడా ఏ ప్రభుత్వ శాఖలో నింపకపోవడంతో వీరంతా స్పెషల్లి ఏబుల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ యూనియన్ (ఎస్‌ఎఇపియు) ఏర్పడి సాంఘిక సంక్షేమశాఖపై యుద్ధం ప్రకటించారు. ఎస్సీల పరిస్థితి కూడా వివక్షతకు గురౌతున్నట్లు బట్వాలా వర్గాన్నిబట్టి తెలుస్తున్నది. ఏ రాజకీయ స్థాయిలో ప్రాతినిధ్యం లేని ఈ వర్గం 13 గ్రూపులుగా వున్న ఎస్సీలను వారి ఆర్థిక, సాంఘిక స్థాయినిబట్టి వర్గీకరించాలనే డిమాండ్‌ను చేస్తున్నది. మరోవైపు అంగన్‌వాడి టీచర్లు కనీస వేతనాలకై(టీచర్లకు 5వేలు, ఆయాలకు 4వేలు) పోరాడుతున్నారు. వీటికితోడు ప్రజా ఆరోగ్య ఇంజనీరింగ్, ఇరిగేషన్‌శాఖ కుంభకోణం, డ్రగ్స్ కుంభకోణం, అటవీ భూముల ఆక్రమణ, వివిధ ప్రాజెక్టుల మంజూరుకు ముడుపుల లాంటి కుంభకోణాలు జమ్మూకాశ్మీరును అతలాకుతలం చేస్తున్నాయి. మొండిబారిన ప్రభుత్వం, సంక్షేమ పథకాల్ని కూడా నిజాయితీగా అందించలేని స్థితి. ప్రకృతి నీటి వనరులు ఘనంగా వున్నా, గ్రామాలు, పట్టణాలు నీటికొరతను ఎదుర్కోవడం ఓ సాధారణ అంశం! ఇక విద్యుత్ కోత లోయను ఎప్పుడు వేడెక్కిస్తూనే వుంటుంది. కాశ్మీర్ విషయంగా వేర్పాటువాద రాజకీయాల్ని, దీని రాజకీయ నాయకుల్ని కాదు విమర్శించాల్సింది, పాలక ప్రభుత్వాలదే కారణమంటూ, జులై 7, 2014న కాశ్మీర్ ఇమేజెస్ అనే దినపత్రిక ‘బాధ్యతతో కూడుకున్న సుపరిపాలన’అనే శీర్షికన ఓ సంపాదకీయాన్ని రాస్తూ, జమ్మూ, కాశ్మీరులు భ్రష్టుకావడానికి ఇతర కారణాలతోపాటుగా, ప్రభుత్వాల అవినీతి, తప్పుడు పరిపాలనా విధానాలే ప్రధాన కారణమని వ్యాఖ్యానించడం గమనార్హం! ఏదైనా లోతుల్లోకి పోతే తప్ప మూలాలు అర్థంకావన్నట్లు, కాశ్మీర్ లోయను దగ్గరుండి చూస్తే తప్ప వాస్తవ పరిస్థితులు అర్థంకావు. మోదీ ప్రభుత్వం ఓ 15 సూత్రాల ఆర్థిక పథకాన్ని కాశ్మీర్‌కై ప్రకటించింది. ఇందులో దాదాపు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రైల్వేలోనే దాదాపుగా ఒక లక్ష ఉద్యోగాల్ని కల్పించాలని చూడడం అభినందనీయం. ఆచరణలో ఎలా వుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: