మెదక్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి పరిశీలనలో ఉన్నప్పటికీ టికెట్ ఎవరికి ఇవ్వాలా అనే ఆలోచనలలో సీఎం ఉన్నారు. అభ్యర్థి, గెలుపు వ్యూహంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మెదక్ జిల్లాపార్టీ ముఖ్యులతో సోమవారం సాయంత్రం చర్చించారు. ఆశా వహులంతా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చునని కేసీఆర్ సూచించారు. మెదక్ ఆశావహులు ఎవరున్నారని జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణను కేసీఆర్ అడిగారు. దీంతో దేవీప్రసాద్, కె.భూపాల్ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి,ప్రవీణ్ రెడ్డి తదితరుల పేర్లను ఆయన వివరించారు. ఈ దశలో పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు జోక్యం చేసుకుని, వారిపేర్లు చెబుతున్న ఆర్.సత్యనారాయణ కూడా టికెట్‌ను ఆశిస్తున్నారని చెప్పారు. టికెట్‌ను ఆశిస్తున్న టీఎన్‌జీఓ అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ను బుజ్జగించడానికి శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రయత్నిస్తున్నారు. దేవీప్రసాద్‌కే టికెట్ ఇవ్వాలని ఉద్యోగసంఘాలు,నేతలు ఇదివరకే కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినసంగతి తెలిసిందే. ఆయనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని కేసీఆర్ వర్తమానం పంపినట్టు తెలిసింది. అన్ని చర్చలు ముగిసిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ప్రభాకర్ రెడ్డికే ప్రాధాన్యత ఇస్తూ ఆయన పేరు ఖరారు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: