ఎవరూ ఊహించని విధంగా, రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ లేనివిధంగా కేంద్ర మంత్రివర్గంలో పదిమందికి అవకాశం దక్కడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. యుపిఎ ప్రభుత్వానికి 33 మంది ఎంపీలతో బలమైన శక్తిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మందికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించి 2014లో జరిగే ఎన్నికల్లో కూడా పెద్దఎత్తున ఎంపీలను గెలుపించుకునే దిశలో కాంగ్రెస్‌ అధిష్టానం పావులు కదుపుతోంది. రాష్ట్రంలో ఏర్పడిన ప్రాంతీయ విభేదాలను దృష్టిలో ఉంచుకుని కూడా ప్రాంతాల వారీగా, సామాజికంగా సమతుల్యత పాటించి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఇందులో ముగ్గురు కేబినెట్‌ మంత్రులు, ఒకరికి ఇండిపెండెంట్‌ చార్జి ఇవ్వగా, ఆరుగురు సహాయ మంత్రులుగా అవకాశం కల్పించి రాష్ట్రానికి పెద్దపీట వేశారు. ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి బిజెపికి కేవలం 8 మంది ఎంపీలే ఉన్నప్పటికీ, అందులో నలుగురికి మంత్రి పదవులు కల్పించారు. యుపిఎ-1 ప్రభుత్వానికి రాష్ట్రం నుంచే ఎక్కువ మంది ఎంపీల బలం ఉండడంతో అప్పుడు కూడా ఐదుగురికి అవకాశం కల్పించారు. ఈసారి ఎన్నికలు, ప్రాంతీయ ఉద్యమాల నేపథ్యంలో రాష్ట్రానికి పెద్దపీట వేయాల్సి వచ్చిందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.కేంద్ర మంత్రి వర్గంలో కొత్తగా అవకాశం దక్కించుకున్న ఐదుగురిలో ముగ్గురు ఎంపీలు సీనియర్లు కాగా, ఇద్దరు లోక్‌సభకు, ఒకరు రాజ్యసభ నుంచి మొదటిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు నజరానాగా చిరంజీవికి అవకాశం కల్పించగా, రాయలసీమలో జగన్‌ను ఎదుర్కొనేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన కోట్ల విజయ భాస్కరరెడ్డికి చోటుదక్కింది. రాష్ట్రంలో బిసి సామాజికవర్గం నుంచి ఒక్క మంత్రి కూడా లేకపోవడంతో కిళ్ళి కృపారాణికి, ఎస్‌టీ ప్రాతినిధ్యం కోసం బలరాం నాయక్‌కు అవకాశం కల్పించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కొనేందుకు సర్వే సత్యనారాయణను మంత్రివర్గంలో చోటు దక్కినట్లు తెలుస్తోంది.ఈ మంత్రివర్గ విస్తరణలో సీనియర్‌ పార్లమెంట్‌ సభ్యులు కావూరి సాంబశివ రావు, వి.హనుమంతరావు, అలాగే సీనియర్‌ ఎంపీ, కేంద్ర మాజీమంత్రులు రేణుకా చౌదరి, సుబ్బరామిరెడ్డి కూడా ఈ విస్తరణలో ఎంతో ఆశించి నీరసించారు. అయితే తనకన్నా పార్టీలో, పార్లమెంట్‌లో జూనియర్లు, కొత్తగా పార్టీలో చేరిన వారికిప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఒక దశలో ఆగ్రహం వ్యక్తంచేశారు. కావూరిని బుజ్జగించి పార్టీపరంగా ఆయన సేవలను వినియోగిస్తామన్న సంకేతాలు ఇవ్వడంతో ఆయన కొంత మేరకు చల్లబడ్డారు. 2014 ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను ఈ విస్తరణలో అవకాశం పొందిన వారికి అప్పగించేందుకే కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించింది. ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణపై దృష్టి కేంద్రీకరించి ఈ విస్తరణ జరిగినట్టు స్పష్టమవుతోంది. ఇంత కసరత్తులు చేసిన కాంగ్రెస్ కు భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: