ఆన్ లైన్ షాపింగ్.. ఇప్పడు షాపింగ్ ప్రక్రియలో ఇదో కొత్త ట్రెండ్.. హాయిగా ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చుని.. కావలసిన వస్తువు ఇంటికే తెప్పించుకోవచ్చు.. నాలుగైదు ఆన్ లైన్ షాపింగ్ సైట్లు చూసి.. అదే వస్తువు ఎక్కడ తక్కువ ధరకు వస్తుందో తెలుసుకోవచ్చు. పనిలో పనిగా ఆఫర్ల సమయంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. ట్రాఫిక్ జాముల్లో ఇరుక్కుని.. నాలుగైదు షాపులు తిరగాలంటే.. ఓ రోజు వృధా.. ఇప్పుడు ఆన్ లైన్ షాపింగ్ తో ఆ కష్టాలు తీరిపోయాయి. వివిధ కంపెనీలు కూడా ఆన్ లైన్ మార్కెట్ సంస్థలతో టై అప్ అయ్యి.. నిర్వహణ ఖర్చులు మిగుల్చుకుని తక్కువ ధరలకే వస్తువులు అందిస్తున్నాయి.                                          ఐతే.. ఈ ఆన్ లైన్ షాపింగుల్లో అప్పుడప్పుడూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుంటాయి. మొన్న శుక్రవారం అలాంటి సమస్య కారణంగానే.. ప్రపంచంలోనే ఆన్ లైన్ షాపింగ్ లో అగ్రస్థానంలో ఉన్న అమెజాన్ వెబ్ సైట్లో వింతలు చోటు చేసుకున్నాయి. కొన్ని వస్తువుల ధరలు కేవలం ఓ పెన్నీ ధరకే అమ్ముడయ్యాయి. అంటే మన రూపాయల్లో చెప్పాలంటే..దాదాపు ఒక్క రూపాయికే వందల కొద్దీ వస్తువులు కస్టమర్లకు దొరికాయన్నమాట. సాఫ్ట్ వేర్ తప్పిదం కారణంగా ఈ సమస్య తలెత్తింది.                                ఆ గంట సమయంలో అమెజాన్ వైబ్ సైట్ చూసిన నెటిజన్లు దీన్ని కూడా ఓ ఆఫర్ గా భావించారు. ఆహా.. భలే మంచి చౌకబేరమంటూ లక్షల కొద్దీ వస్తువులు కొనేశారు. దీంతో ఆ కంపెనీలకు ఇప్పుడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. వీటిలో ఎక్కవగా చిన్న కంపెనీలే ఉన్నాయట. అమెజాన్ తమకు జరిగిన నష్టాన్ని పూడ్చకపోతే.. వ్యాపారం నుంచి తప్పుకోవడ మినహా వేరే మార్గంలేదని ఆ కంపెనీలు మొత్తుకుంటున్నాయి. మొత్తం మీద ఆ టైమ్ లో అమెజాన్ లో షాపింగ్ చేసిన వాళ్లు మాత్రం బాగుపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: