2015 వస్తూనే విశాఖ తీర వాసులను వణికించేసింది. ఉవ్వెత్తున ఎగసిపడిన సముద్రం తీవ్ర కలవరానికి గురి చేసింది. సాగరం బాగా ముందుకువచ్చి.. తీరాన్ని భారీగా కోసేసింది. అలల ధాటికి విశాఖలోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర రక్షణ గోడ కూలిపోయింది. మరికొద్దిసేపటికే... అలలు మరింత ముందుకు వచ్చి.. నడకదారిని కూడా కోసేశాయి. సముద్రంలో అలజడి కారణంగా విశాఖ తీరవాసులు బీచ్ లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోలేకపోయారు. బీచ్ రోడ్డులో రాకపోకలు నిషేధించారు. విశాఖ శివార్లలోని యారాడ, భీమిలి, రుషికొండ, సాగర్ నగర్.. తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి.. విశాఖ కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది.. జీవీఎంసీ, ఉడా అధికారులు పరిస్థితి దగ్గర ఉండి సమీక్షిస్తున్నారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే అలల ఉధృతి పెరిగిందని వాతావరణశాఖ తెలియజేస్తోంది. కాకపోతే..హుద్ హుద్ తీవ్రత వల్ల తీరం బాగా బలహీనపడిందని.. దీని వల్ల.. సముద్రం ముందుకు వచ్చి ఉంటుందని.. సముద్ర అధ్యయన నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా సరిగ్గా కొత్త సంవత్సరం వేళ ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం విశాఖ వాసులనే కాదు.. తీర ప్రాంతవాసులందరినీ కలవరపెడుతోంది. ఆరంభమే ఇలా ఉంటే.. ముందు ముందు ఇంకెలా ఉంటుందోనని భయపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: