నారా చంద్రబాబునాయుడు బుధవారం స్వగ్రామం నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. కళాకారులతో కలసి కాసేపు కోలాటం, చెక్కభజన చేశారు. ఉదయం టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి నారా కుటుంబీకులు, నందమూరి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు తల్లిదండ్రుల సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించారు. బాబు వెంట సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, నందమూరి రామకృష్ణ తదితరులు ఉన్నారు. అనంతరం సినీ నటుడు నారా రోహిత్ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎమ్మెల్యేలు గాలిముద్దుకృష్ణమనాయుడు, చదలవాడ కృష్ణమూర్తి, సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య, తంబళ్ళపల్లె ఎమ్మెల్యే శంకర్ యాదవ్, జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, చిత్తూరు మేయర్ అనురాధ, తదితరులు చంద్రబాబునాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు శ్రీధర్ వర్మ, కర్నాటక టీఎన్‌ఎస్‌ఎఫ్ ఇన్‌చార్జి రవినాయుడు భారీ కేక్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశాఖ ఉదూద్ తుపాన్ బాధితుల సహాయార్థం విశ్రాంతి విద్యుత్ ఉద్యోగులు ఒక కోటి 11 లక్షల 751 రూపాయలు, యాదమర్రి మండలం నుంచి 3లక్షల 60వేలు, తిరుపతి శ్రీరామ్ ఫైనాన్స్ మేనేజర్ డి.వెంకటేశ్వర్లు, కంపెనీ తరపున ఒక లక్ష 11వేల 111 రూపాయలు, తిరుమల తిరుపతి హోటల్ అసోసియేషన్ వారు 5లక్షల 85వేల రూపాయలను అందించారు. తిరుపతి ప్రముఖ వైద్యులు డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్‌లు ముఖ్యమంత్రి చేతుల మీదుగా సహస్ర చండీయాగం బ్రోచర్‌ను ప్రారంభించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో సుగుణమ్మ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని తాము స్వాగతిస్తున్నామని తిరుపతి కోఆపరేటివ్‌బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి చంద్రబాబుకు తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోవడం వల్ల కొందరు నాయకులు స్వలాభం కోసం పత్రికల్లో అపోహలు సృష్టిస్తున్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: