ఢిల్లీ ఓటమి నేపథ్యంలో కమలనాథులకు మైండ్ బ్లాంక్ గా మారిందో ఏమో కానీ.. వారు మాట్లాడుతున్న మాటలు మాత్రం చిత్రంగా ఉంటున్నాయి. ఓటమి కారణాలను చెప్పడానికి సాకులను వెదుక్కొంటున్న కమలనాథులు ఏదేదో చెబుతున్నారు. ఇవి మోడీ పాలనకు రిఫరెండం కాదు అని చెప్పడం కమలనాథుల ప్రధాన ఉద్దేశం. ఇలాంటి నేపథ్యంలో వారు మాట్లాడుతున్న మాటలు, చెబుతున్న సాకులు వినే వాళ్లకు కూడా నమ్మశక్యంగా కనపడటం లేదు.

తన ఓటమి కారణం ఢిల్లీ మసీదు ఇమామ్ బుఖారీనే అని ఢిల్లీ ఎన్నికల్లో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడిన కిరణ్ బేడీ ప్రకటించడం అతి పెద్ద విడ్డూరం. ఆయన పిలుపు మేరకు ముస్లింలు అంతా ఆప్ కు ఓటేశారని అందుకు తాను ఓడిపోయానని కిరణ్ ప్రకటించుకొన్నారు. అయితే స్థూలంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సామాన్యుడికి భారతీయ జనతా పార్టీపై , కాంగ్రెస్ పైఉ న్న ఆగ్రహానికి ప్రతీకలుగా కనిపించాయి.

అంతే కానీ.. ఏదో బుఖారీ చెప్పాడనో.. మరో మత పెద్ద సూచించాడనో ప్రజలు ఓటేసిన పరిస్థితి కనపడలేదు. ఆప్ కు పూర్తి స్థాయి మద్దతు గా నిలిచారు ప్రజలంతా. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ కూడా ఒప్పుకొని తీరాలి. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి, మోడీకి ఎలాంటి మద్దతు లభించిందో...ఢిల్లీలో ఆప్ కు అలాంటి మద్దతే కనిపించింది.

ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి మొహమాటంతో భారతీయ జనతా పార్టీ నేతలు బుఖారీల పేర్లు చెప్పుకొని తాము సేఫ్ జోన్ లోకి వెళదామని భావిస్తున్నట్టుగా ఉన్నారు. అయితే ఇలాంటి ప్రయత్నాలు అన్నీ కామెడీలు అవుతాయి.. ఇలాంటి రీజన్లు చెప్పే నేతలు ప్రజల మద్య పలచబడతారు తప్ప.. అంతకు మించిన ప్రయోజనం ఉండదేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: