ఏపీకి ఒక అద్భుత రాజధాని కావాలంటే.. 30 వేల ఎకరాలు కావాల్సిందేనంటూ ఇన్నాళ్లూ సన్నాయి నొక్కులు నొక్కిన ప్రభుత్వం ఇప్పుడు మాట మారుస్తున్నదా? అవసరమైనంత మేరకు రైతులనుంచి భూముల స్వాధీనానికి ఒప్పంద పత్రాలు తీసేసుకున్న తరువాత.. ఇప్పుడు అసలు సీక్రెట్‌ ముడి విప్పుతున్నదా? పురపాలక మంత్రి నారాయణ మాటలు గమనిస్తోంటే చాలా సందేహాలు రేకెత్తుతున్నాయి. సేకరించిన స్థలంలో ‘ప్రధాన రాజధాని’కి రెండు వేల ఎకరాలు స్థలం  కేటాయించనున్నట్లు మంత్రి పేర్కొంటున్నారు. మరి మిగిలిన 28 వేల ఎకరాలు ఏం చేయబోతున్నట్లు? సరిగ్గా ఈ పాయింటు దగ్గరే అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. తొలినుంచి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఆరోపిస్తున్నట్లుగా.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవడానికే చంద్రబాబు ప్రభుత్వం రైతులనుంచి భూములు లాకుకంటున్నదనే వాదనకు బలం చేకూరుతున్నది. 
గుంటూరు జిల్లాలో రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంలో పల్లెల వారీగా తిరుగుతూ పొలాలను చదును చేసే కార్యక్రమంలో పాల్గొంటున్న పురపాలక మంత్రి నారాయణ మంగళగిరి వద్ద మాట్లాడుతూ ‘సీడ్‌ క్యాపిటల్‌ (ప్రధాన రాజధాని) ప్రాంతం రెండు వేల ఎకరాలు మాత్రమే ఉంటుందని సెలవిచ్చారు. ఇదేదో ఆయన జనాంతికంగా చెప్పిన మాటకూడా కాదు. ప్రధాన రాజధానికి రెండు వేల ఎకరాలు చాలునని సింగపూర్‌ బృందమే ఖరారు చేసినట్లు కూడా నారాయణ ధ్రువీకరించారు. సీడ్‌ క్యాపిటల్‌లోనే సీఎం కార్యాలయం, రాజ్‌భవన్‌, అన్ని డిపార్టుమెంటుల కార్యాలయాలు, సెక్రటేరియేట్‌, మంత్రుల, ఎమ్మెల్యేల క్వార్టర్లు, అసెంబ్లీ, ఆసుపత్రులు, పార్కులు వంటివి అన్నీ ఏర్పాటు అవుతాయిట. అయితే ప్రస్తుతం ఒప్పంద పత్రాల ద్వారా సేకరించినట్లుగా చెబుతున్న 30 వేల ఎకరాల్లో.. 2 రెండు వేల ఎకరాల ఏ గ్రామ పరిధిలోకి వస్తాయనే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేం అని నారాయణ అంటున్నారు. 

కొత్త సందేహాలకు ఆస్కారం ఇస్తున్న మంత్రి నారాయణ


ఇక్కడే అసలు సందేహాలు బలపడుతున్నాయి. మరి రాజధానికి అవసరమైన అన్ని హంగులూ సీడ్‌ క్యాపిటల్‌లోనే ఉంటాయి అన్నట్లుగా మంత్రి నారాయణ మాటలు ఉన్నాయి. ప్రజల దృష్టిలో రాజధాని అంటే ఏమేం ఉంటాయో.. అవన్నీ ఈ రెండు వేల ఎకరాల్లోనే ఉంటాయన్నమాట. మరి మిగిలిన 28 వేల ఎకరాల్లో ఏం ఉంటాయో సామాన్యులకు అర్థం కావడం లేదు. సమగ్ర అద్భుత రాజధానిని ఆవిష్కరింపజేసే ప్రయత్నం అనే  ముసుగులో చంద్రబాబు సర్కారు సదరు 28వేల ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ దందా నడిపిస్తుందా? అనే అనుమానాలే ఎక్కువగా కలుగుతున్నాయి. చంద్రబాబు సర్కారు.. అచ్చంగా రియల్‌ఎస్టేట్‌ దళారీల్లాగానే పనిచేస్తున్నదంటూ.. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డి తొలినుంచి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. రాజధాని కావాలనుకుంటే.. దానికి 30 వేల ఎకరాలు ఎందుకు? అంటూ గతంలో తెలుగుదేశానికే చెందినవారు, తటస్తులు కూడా అయిన అనేక మంది మేధావులు ప్రశ్నిస్తూనే వచ్చారు. వారందరూ చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రతినిధులు ప్రతివిమర్శలు గుప్పిస్తూ వచ్చారు. అదే సమయంలో కేంద్రంనుంచి వెంకయ్యనాయుడు వంటి వారు కూడా.. కొత్త రాష్ట్రానికి కొత్త రాజధాని అంటే.. ఆ మాత్రం అవసరం.. దార్శనిక దృక్పథంతో ఆలోచించాలి అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. తీరా.. వర్తమానంలోకి వస్తే.. ప్రధాన రాజధానికి రెండు వేల ఎకరాలు చాలునని మాస్టర్‌ప్లాన్‌లు సిద్ధం చేస్తున్న సింగపూర్‌ కంపెనీనే సెలవిస్తున్నట్లుగా మంత్రి నారాయణే వెల్లడిరచేశారు. అంటే ఇన్నాళ్లూ ప్రభుత్వం ప్రజల్ని మాయచేసి భూముల ఒప్పంద పత్రాలు రాయించుకున్నట్లుగా తెలుస్తోంది. 
మరి ప్రభుత్వం సాగిస్తున్న ఈ రియల్‌ దందాలో... వాస్తవంగా రైతులకు జరిగే లాభమెంతో.. నష్టమెంతో.. మరికొంత కాలం గడిస్తే గానీ.. తేలకపోవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: