ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 12 స్థానాలకు గాను రెండు చోట్ల మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. పది స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. బలం లేని చోట పోటీ వద్దనే పోకడకు పార్టీలు కట్టుబడడం వల్ల మాత్రమే ఇలా.. పదిస్థానాలు ఏకగ్రీవం కావడం జరిగింది. ఇకపోతే రెండు జిల్లాల్లోమాత్రం ఎన్నికలు జరుగుతున్నాయి. కర్నూలు, ప్రకాశంలలో మాత్రమే. ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ రెండు జిల్లాల్లో బోలెడుమంది ‘రేవంత్‌రెడ్డి’లు ఇప్పటికే రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. 


ఈ ఎన్నికల్లో వైకాపా తమకు బలం లేని చోట పోటీ వద్దని ముందే డిసైడ్‌ చేసుకుంది. తాము మాత్రం మొత్తం వీలైనన్ని సీట్లు గెలుచుకోవాలనుకున్న తెదేపా.. ఒక్క గుంటూరులో మాత్రం.. తేడా చాలా ఎక్కువగా ఉండడంతో రెండోస్థానంపై ఆశ వదులుకుంది. అయితే ప్రకాశం, కర్నూలు జిల్లాలో సంఖ్యాపరంగా చూసినప్పుడు వైకాపాకే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. దీంతో ఆ రెండు చోట్ల వారు రంగంలోకి దిగారు. ఇరు పార్టీల మధ్య వ్యత్యాసం తక్కువగానే ఉంది. అధికార పార్టీ ఆఫర్లు ప్రకటిస్తే.. వారు గెలిచే అవకాశమే ఎక్కువ. కానీ తమకు బలం ఉన్నచోట కూడా పోటీచేయకుంటే... అధికార పార్టీ వారి బేరసారాల అక్రమాలు కూడా ప్రజల దృష్టికి తెలిసేదెలా అనే ఉద్దేశంతో వైకాపా బరిలోకి దిగిందనుకోవాలి. 


ఇప్పుడు తమ పార్టీని గెలిపించుకోవడానికి తెలుగుదేశం తరఫున గుట్టుచప్పుడు కాకుండా బేరాలు నడిపి.. ఓట్లు వేయించగల సమర్థులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తమ పార్టీ ఓట్లు మాత్రమే కాకుండా, ఎదుటి పార్టీలోని ఓట్లు కూడా వేయించగల వారు రకరకాల ఆఫర్ల సంచులతో సిద్ధం అయ్యారుట. అయితే రేవంత్‌రెడ్డి వ్యవహారం కళ్లముందు కనిపిస్తూనే ఉన్నది గనుక.. చాలా జాగ్రత్తగా రహస్యంగా ఎక్కడా రికార్డింగులకు, టేపులకు దొరక్కుండా వ్యవహరిస్తున్నారట. మొత్తానికి బేరాలు పెట్టకుండా, తాయిలాలు ఇవ్వకుండా ఈ రెండు జిల్లాల్లో తెలుగుదేశం ఎన్నికలు ఎదుర్కొనడం లేదనేసంగతి తేలిపోతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: