మద్యం సిండికేట్ల కేసు దర్యాప్తు పూర్తయ్యింది. ఏసీబీ చివరి నివేదికను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించింది. హైకోర్టు నివేదికను పరిశీలించి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. దీంతో రాజకీయ నాయకులు, ఎక్సైజ్ అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. కోర్టు ఆదేశాల మేరకు సిండికేట్లపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ దశల వారిగా కోర్టుకు నివేదికను సమర్పించింది. ఇక తాజాగా అందించిన చివరి నివేదికలో ఎవరి పేర్లు ఉన్నాయోనని రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏసీబీ నివేదిక సమర్పించగానే అటు ఎక్సైజ్ , ఇటు పోలీసు శాఖలో కూడా కలకలం మొదలైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఎక్సైజ్ సిండికేట్ల కార్యాలయాలపై సోదాలు నిర్వహించిన ఏసీబీ... రికార్డుల ఆధారంగా పలువురు ఎక్సైజ్, పోలీసు సిబ్బందిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించింది. ఇక ఖమ్మం, వరంగల్ సిండికేట్ డాన్ నున్నా రమణను అరెస్టు చేశాక అసలు డొంక కదిలింది. విచారణలో నున్నారమణ మాజీ మంత్రి మోపిదేవి వెంకటన రమణ పేరును ప్రస్తామించాడు. సిండికేట్లకు సంబంధించి మోపిదేవికి లంచం ఇచ్చానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అటు వరంగల్ జిల్లా మొయినాబాద్ ఎమ్మెల్యే మాలోతు కవితతో పాటు పలువురు ఎమ్మెల్లేలను ఏసీబీ అధికారులు ఇదివరకే ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో కూడా మద్యం సిండికేట్లతో సంబంధం ఉన్న ఎమ్మెల్యేలను ఏసీబీ విచారించింది. ఖమ్మం జిల్లాలోని కమ్యూనిస్టు నేతలతోపాటు పలువురు రాజకీయ నాయకులకు భారీ మొత్తంలో ముడుపులు చెల్లించినట్లు సిండికేట్లు నిర్వహించిన వారి ఖాతా పుస్తకాల ద్వారా తెలిసింది. ఇంతే కాకుండా మద్యం సిండికేట్ల వ్యవహారంలో పీసీసీ చీఫ్ బొత్స పైనా ఆరోపణలొచ్చాయి. పలు మద్యం షాపుల్ని బొత్స బినామీలే నడిపారన్నదానిపైనా విచారణ జరిగింది. మరో సిండికేట్ కేసుకు సంబందించి దర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడును ఏసీబీ ప్రశ్నించింది. ఇప్పుడు ఏసీబీ చివరి నివేదిక సమర్పించడంతో రాష్ట్రంలోని రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది. నివేదికలో ఎవరి పేర్లను పొందుపర్చారోనని సిండికేట్లతో సంబందం ఉన్న రాజకీయ నాయకులు, ఎక్స్ సైజ్ సిబ్బంది, పోలీసులు మదనపడుతున్నారు. ఈ చివరి నివేదిక సంభందించి రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: