ఇటీవల నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న ఆర్కిటెక్ విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతం ప్రకంపనలు సృష్టిస్తోంది. కొందరు విద్యార్థులు రిషితేశ్వరిని ర్యాగింగ్ పేరుతో లైంగిక వేధింపులకు గురిచేసినట్లు, ఆ వీడియో దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లు కథనాలు వచ్చాయి. అంతే కాదు. అరాచక చర్యలకు పాల్పడిన విద్యార్థులను అధ్యాపకవర్గంలోని కొందరు ప్రోత్సహించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. 

రిషితేశ్వరి వరంగల్ కు చెందిన అమ్మాయి కావడంతో .. టీఆర్ఎస్ ఎంపీ ఈ అంశంపై స్పందించారు. సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఆమె లేఖ రాశారు. ఈ ఘటన వెనుక సమాజంలో అత్యంత పలుకుబడి, అండదండలు కలిగిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని, నిజానిజాలు తేలాలంటే సమగ్ర విచారణ జరిపించాలని ఆమె కోరారు. రిషితేశ్వరి బలవన్మరణం ఎంతో కలవరానికి గురిచేసిందని, మహిళల భద్రతను కాంక్షించేవారిని ఆందోళన కలిగిస్తున్నదన్నారు. 

మరోవైపు ఇదే అంశంపై ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. రిషితేశ్వరి ఘటనలో ఆత్మహత్య లేఖ ఉన్నా కూడా.. ఈ కేసును ప్రభుత్వం అటకెక్కించిందంటూ ఆయన ట్విట్టర్ ద్వారా ఆరోపణలు గుప్పించారు. సమాజంలో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు భయం భయంగా బతకాలన్నదే ఈ ప్రభుత్వం ఇస్తున్న సందేశమా అని ఆయన ప్రశ్నించారు.  

ఈ రిషితేశ్వరి ఆత్మహత్య ఉదంతం పెను వివాదంగా మారడంతో ఏపీ సర్కారు చర్యలు చేపట్టింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వం లో శ్రీవెంకటేశ్వర వర్సిటీ ప్రొఫెసర్ బాలకృష్ణనాయుడు, విక్రమసింహపురి వీసీ వీరయ్య, పద్మావతి మహిళా వర్సిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మిని సభ్యులుగా విచారణ కమిటీని నియమించింది. ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సోషల్ మీడియాలో రిషితేశ్వరి కుటుంబానికి మద్దతుగా విశేషంగా స్పందన లభిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: